ఢిల్లీలో అందరికీ ఫ్రీ వ్యాక్సిన్లు , కీలక ప్రకటన చేసి వ్యాక్సిన్ల ధరపై కేంద్రానికి కేజ్రీవాల్ చురకలు
కరోనా వ్యాక్సిన్ విషయంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది . దేశ రాజధాని ఢిల్లీలో అందరికీ కరోనా వ్యాక్సిన్ లు ఫ్రీగా ఇవ్వనున్నట్లుగా కేజ్రీవాల్ సర్కార్ ప్రకటన చేసింది. ఢిల్లీలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగానే వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.

వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం 1.34 కోట్ల మోతాదుల వ్యాక్సిన్ల ఆర్డర్: వెల్లడించిన కేజ్రీవాల్
వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం 1.34 కోట్ల మోతాదుల వ్యాక్సిన్లను ఆర్డర్ చేశామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. ప్రతి ఒక్కరికి కోవిడ్ -19 టీకాలు శనివారం (మే 1) నుండి అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్లు అందించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. సిఎం అరవింద్ కేజ్రీవాల్ వర్చువల్ విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

కరోనా వ్యాక్సిన్ల ధర వ్యత్యాసంపై మండిపడిన ఢిల్లీ సీఎం
కోవిడ్ -19 వ్యాక్సిన్ల ధర వ్యత్యాసంపై రాష్ట్రాలకు నిర్ణయించిన అధిక ధర విషయంలో కేంద్రంపై విరుచుకుపడ్డారు అరవింద్ కేజ్రీవాల్. ఇది లాభాలను ఆర్జించే సమయం కాదన్నారు . అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, "ఒక సంస్థ రాష్ట్రాలకు వ్యాక్సిన్ ధరలను మోతాదుకు 400 రూపాయలుగా నిర్ణయించగా, మరొక సంస్థ వ్యాక్సిన్ మోతాదుకు 600 రూపాయల చొప్పున ఇస్తోంది. అయితే కేంద్రం వాటిని 150 రూపాయలకు పొందుతుంది. ఈ వ్యత్యాసం దేనికని ప్రశ్నించారు అరవింద్ కేజ్రీవాల్.

ఇది లాభాలను ఆర్జించే సమయం కాదని కేజ్రీవాల్ చురకలు
ఇది లాభాలను ఆర్జించే సమయం కాదని తయారీ సంస్థలనుద్దేశించి పేర్కొన్న ఆయన లాభాల కోసం ఇంకా జీవిత కాలం అంతా ఉందని మండిపడ్డారు. వ్యాక్సిన్ లపై పరిమితులు విధించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాలకు ఇచ్చే వ్యాక్సిన్ ధరలను తగ్గించాలని, కేంద్రానికి ఇస్తున్న ధరకే వ్యాక్సిన్ లు తమకు అందించాలని అరవింద్ కేజ్రీవాల్ వ్యాక్సిన్ తయారీదారులను కోరారు. అందరికీ ఒకే విధానం ఉండేలా నిర్ణయం తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్లు ఇస్తామన్న ఢిల్లీ సర్కార్
మొత్తానికి ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా కరోనా మహమ్మారి నివారణ కోసం నడుంబిగించారు. అందులో భాగంగానే ఢిల్లీ ప్రజలందరికీ ఫ్రీ గా వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, హర్యానా సైతం తమ రాష్ట్ర పౌరులకు వాక్సినేషన్ ఉచితంగా చేస్తామని ప్రకటించారు.
కరోనా నివారణ కోసం యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని భావిస్తున్న తరుణంలో మే 1 నుండి మూడో దశ వ్యాక్సినేషన్ కొనసాగనుంది .












Click it and Unblock the Notifications