తొలగిపోయిన ''మోడీ మంచుతెరలు??'' .. గులాంనబీ ఆజాద్ కు స్పష్టంగా కనపడుతున్న సోనియాగాంధీ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కు కళ్లముందే మోడీ మంచుతెరలు కరిగిపోయాయి. తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతోపాటు కాంగ్రెస్ కూడా స్పష్టంగా దర్శనమిస్తోంది. ఆజాద్ కళ్లెదుటే రాష్ట్రపతిగా, ఉప రాష్ట్రపతి అభ్యర్థులు ఎంపికయ్యారు. ఆయనకు ఏమాత్రం అవకాశం లభించలేదు. గతేడాది నుంచి ఆజాద్ కు ఈ రెండింటిలో ఏదో ఒకటి దక్కుతుందన్న రాజకీయ విశ్లేషకుల అంచనాలు తారుమారయ్యాయి.

రాష్ట్రపతికానీ, ఉప రాష్ట్రపతి కానీ ఖాయమనుకున్నప్పటికీ...
గతేడాది రాజ్యసభలో గులాంనబీ పై మోడీ ప్రశంసలతో ముంచెత్తారు. ఆయనంటే తనకు ఎంతో గౌరవమని, విపక్షంలో ఉన్నప్పటికీ హుందాగా మాట్లాడతారని, ఎప్పుడూ అసభ్య పదజాలం ఉపయోగించరని కొనియాడారు. ఆయన నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, కొత్తగా సభలో అడుగుపెట్టేవారు అజాద్ నుంచి స్ఫూర్తి పొందవచ్చంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. ఆజాద్ మైనారిటీలకు చెందిన వ్యక్తి కాబట్టి, ఎన్డీయే తరఫున ఆయన్ను రాష్ట్రపతిగా లేదంటే ఉప రాష్ట్రపతిగా ఎంపిక చేయవచ్చని, అలాగే జ్మమూ కాశ్మీర్ లో మైనార్టీలను ఆకట్టుకోవడానికి కూడా బీజేపీ ప్రభుత్వం వేసిన ఎత్తుగడగా రాజకీయ వర్గాలు భావించాయి. సభలోనే కాకుండా బయట కూడా పలు సందర్భాల్లో మోడీ ఆజాద్ ను కొనియాడారు.

ఏడాదిలో అన్నీ కరిగిపోయాయి
సంవత్సరం తిరిగి వచ్చేసరికి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎంపికవగా, జగదీప్ దన్కర్ త్వరలోనే ఉప రాష్ట్రపతి కాబోతున్నారు. అందుకు తగ్గ సంఖ్యాబలం ఎన్డీయేకు ఉందనే అంచనాలున్నాయి. ఆజాద్‌కు ఎటువంటి పదవి రాదని స్పష్టమైందని రాజకీయవర్గాలు అంచనా వేశాయి. దేశవ్యాప్తంగా తనకు పేరు ప్రఖ్యాతులు రావడానికి కారణమైన సొంత తల్లి లాంటి పార్టీపై, పార్టీ అధినేతలపై ఏడాదిన్నర కాలంగా జీ-23 పేరుతో ఆజాద్ తరుచుగా విమర్శలు గుప్పించారు. పార్టీని బలోపేతం చేయడానికి తనవంతు ప్రయత్నాలు వదిలి సంస్థాగత మార్పులు చేయాలంటూ కొన్నాళ్లుగా విమర్శనాస్త్రాలు సంధించారు. అసమ్మతి నేతలు 23 మంది కలిసి జీ-23 పేరుతో బృందంగా ఏర్పడి సమర్థవంతమైన నాయకత్వానికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని, పూర్తిగా ప్రక్షాళించాలని డిమాండ్ చేశారు.

ఆజాద్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో..
తాజాగా ఆజాద్ సోనియా ఈడీ విచారణకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలు చేసే సమయంలో కూడా రాజులు మహిళల జోలికి వెళ్లవద్దని సైన్యానికి సూచనలు జారీచేసేవారని, అనారోగ్యంతో ఉన్నవారిని వదిలివేయమని చెప్పేవారని, వయసు మీదపడి అనారోగ్యంతో ఉన్న సోనియాను ఈడీ కేసులో దఫదఫాలుగా విచారించడం సరికాదని, సంస్థల చుట్టూ తిప్పొద్దని కోరారు. ఈడీ కఠినంగా ఉండొద్దని, రాజకీయ ప్రత్యర్థులను శత్రువులగా చూడొద్దంటూ సోనియాగాంధీకి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన దర్యాప్తు సంస్థల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ ను ప్రశ్నించిన తర్వాత తిరిగి సోనియాను ప్రశ్నించడం అర్థం లేని చర్య అని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications