కారు కావాలని వరుడు పట్టు: పెళ్లే చేసుకోనన్న వధువు

ఒక వేళ అతనితో వివాహమైన తర్వాత కట్నం కోసం డిమాండ్ చేసివుంటే తాను సర్దుకుపోవాల్సి వచ్చేదని, లేదంటే పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులు తనను చంపేసే వారని పెళ్లి కూతురు ఆర్తి మీడియాకు తెలిపింది. భోపాల్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్న ప్రదీప్ చౌధరికి, ఆ యువతికి వివాహం నిశ్చయమైంది. అయితే తమ ఇంటికి వచ్చిన స్నేహితులు, బంధువులు ఉండగానే తమకు బైకు వద్దని, కారు కావాలని పెళ్లి కుమారుడు, అతని కుటుంబ సభ్యులు ఆమె కుటుంబ సభ్యులతో వాదనకు దిగారు.
పెళ్లి కూతురు ఆర్తి బంధువుల కథనం ప్రకారం.. ఆర్తికి, ప్రదీప్ చౌధరికి మూడు నెలల క్రితం వివాహం నిశ్చయమైంది. అయితే వారి ఎంగేజ్‌మెంట్ అయిన నాటి నుంచి పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యుల నుంచి కట్నం కోసం డిమాండ్లు పెరుగుతూ వచ్చాయి. ఆర్తి కుటుంబ సభ్యులు అప్పటికే తమకు సాధ్యమైన మేరకు కట్నం ఇచ్చేందుకు అంగీకరించారు.
అయితే ప్రదీప్ కుటుంబ సభ్యులు ఒకటి తర్వాత ఒకటి వారి డిమాండ్లను పెంచుకుంటూ వచ్చారు. ఆర్తి కుటుంబ సభ్యులు పెళ్లికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఇంతకుముందు అంగీకరించిన విధంగా తమకు బైకు కాకుండా కారు ఇవ్వాలని వారు డిమాండ్ చేయడంతో వాదన మొదలైంది. దీంతో మనస్తాపానికి గురైన ఆర్తి తాను ఈ వివాహాన్ని చేసుకోవడం లేదని తేల్చి చెప్పేసింది. అంతేగాక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రదీప్, అతని తండ్రిని, మరో ఇద్దరు అతని కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications