పాకిస్తాన్ చుట్టూ భారత్ చక్రబంధం
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదుల కిరాతక దాడి తరువాత భారత్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ మారణహోమానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం కావడం వల్ల ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగింది.
పాకిస్తాన్ జాతీయులకు భారత వీసాలను నిలిపివేయడం, పాకిస్తాన్ హైకమిషన్‌లో సిబ్బందిని తగ్గించాలని ఆదేశించడం, అట్టారి-వాఘా బోర్డర్ చెక్‌పోస్ట్‌ను మూసివేయడం వంటి చర్యలను తీసుకుంటోంది. ఐక్యరాజ్య సమితి వంటి అత్యున్నత స్థాయి అంతర్జాతీయ వేదికలపైనా పాకిస్తాన్‌ను ఒంటరి చేసే ప్రయత్నాలు సాగిస్తోంది.

ఈ క్రమంలో మరో అడుగు ముందుకువేసింది భారత్. పాకిస్తాన్‌తో ఇప్పటివరకు అరకొరగా కొనసాగిన వాణిజ్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంది. ఎగుమతి-దిగుమతులను నిలిపివేసింది. ఇకపై ఆహార పదార్థాలు మొదలుకుని ఫార్మా వరకూ భారత్ నుంచి ఏ ఒక్క వస్తువు కూడా పాకిస్తాన్‌కు ఎగుమతి కాబోదు.
కాటన్, కాఫీ, టీ, కొన్ని రకాల కూరగాయలు, వంటనూనె, మసాలా దినుసులు, ఆయిల్ సీడ్స్, పశువుల కోసం దానా, ప్లాస్టిక్ వస్తువులు, పాల ఉత్పత్తులు, ఫార్మాసూటికల్స్ ప్రొడక్ట్స్.. వంటివి పాకిస్తాన్ ఎగుమతి అవుతున్నాయి. వాటన్నింటినీ కూడా తక్షణమే నిలిపివేసింది భారత్.
దీనికి ఇక్కడితో బ్రేకులు పడలేదు. మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. పాకిస్తాన్‌కు సంబంధించిన నౌకలకు భారత్‌లో నిలువనీడ లేకుండా చేసింది. ఇకపై దేశంలో ఉన్న ఏ ఒక్క పోర్టులో కూడా పాకిస్తాన్‌కు చెందిన ఏ నౌకకూ హాల్ట్ సౌకర్యం కల్పించకూడదని ఆదేశాలను జారీ చేసింది. వాటి రాకపోకలపై పూర్తిస్థాయి నిషేధాన్ని విధించింది.
అదే సమయంలో పోస్టల్ సర్వీసులను కూడా నిలిపివేసింది. ఈ మేరకు సమాచార మంత్రిత్వ శాఖ ఆదేశాలను జారీ చేసింది. పాకిస్తాన్ నుండి వాయు లేదా ఉపరితల రవాణ మార్గాల ద్వారా వచ్చే అన్ని రకాల పోస్టల్ సర్వీసులు, పార్శిళ్ల మార్పిడిని నిలిపివేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని తెలిపింది.












Click it and Unblock the Notifications