3,500లకు పైగా లోన్ యాప్‌లను ప్లే స్టోర్ నుండి తొలగించిన గూగుల్.. కారణమిదే!!
సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ తన ప్లే స్టోర్ పాలసీతో భారతదేశంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఆన్లైన్ రుణాలపై కొరడా ఝుళిపించింది. 2022 సంవత్సరంలో గూగుల్ ప్లే స్టోర్ పాలసీని ఉల్లంఘించిన 3500 కు పైగా లోన్ యాప్ లపై గూగుల్ చర్యలు తీసుకుంది.
డిజిటల్ ప్లాట్ ఫామ్ ను వేదికగా చేసుకొని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఆన్లైన్ రుణ యాప్ లపై గూగుల్ తీసుకున్న ఈ చర్యలతో పలువురి నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. కొంతకాలంగా లోన్ యాప్స్ ఆగడాలు మితిమీరుతున్న విషయం తెలిసిందే. లోన్ యాప్స్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యల బాట పడుతున్నారు.

దీంతో నిబంధనలకు విరుద్ధంగా, ప్లే స్టోర్ పాలసీని ఉల్లంఘిస్తూ కొనసాగిస్తున్న లోన్ యాప్స్ పై చర్యలలో భాగంగా 3500 కు పైగా లోన్ యాప్ లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. మోసపూరితమైన చర్యల ద్వారా యువతను, డబ్బు అవసరం ఉన్న వారిని ప్రలోభపెట్టి లోన్లు ఇస్తూ, ఆపై అధిక వడ్డీలతో లోన్లు తీసుకున్న వినియోగదారులను వేధిస్తున్నాయి యాప్ లు.
వినియోగదారుల వ్యక్తిగత సమాచారంతో వారిని వేధింపులకు గురి చేస్తున్నాయి. దీంతో ఈ లోన్ యాప్ లకు చెక్ పెట్టడానికి రంగంలోకి దిగిన గూగుల్ అటువంటి మోసపూరితమైన యాప్ లను బ్యాన్ చేసింది. 2021 సంవత్సరంలో వ్యక్తిగత రుణాలు అందించే వాటితో సహా భారతదేశంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సేవలు అందించే యాప్ ల కోసం గూగుల్ తన విధానాన్ని అప్డేట్ చేసుకుంది.
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, బ్యాంకులకు ఫెసిలిటేటర్ లుగా రుణాలను అందించే విషయంలో గూగుల్ తరచుగా సమీక్షలు జరుపుతోంది. ఈ సమీక్షలో ప్లే ప్రొటెక్ట్ రిపోర్టు ప్రకారం గూగుల్ ప్లే స్టోర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 2022 లో భారత దేశంలోని మూడు వేల ఐదు వందల కంటే ఎక్కువ లోన్ యాప్ లను బ్యాన్ చేసింది.












Click it and Unblock the Notifications