పీకేతో నా మీటింగ్స్‌ను మోదీ వినేశాడు -పెగాసస్‌పై మమతా బెనర్జీ మరో బాంబు -ప్రధానితో భేటీ ఫిక్స్
ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు సహా 300 మంది ప్రముఖుల ఫోన్ నంబర్లను కేంద్ర ప్రభుత్వమే హ్యాకింగ్ చేసిందని, ఇందుకోసం ఇజ్రాయెల్ కు చెందిన పెగాసస్ స్సైవేర్ ను ఉపయోగించిందనే ఆరోపణలపై పార్లమెంటు దద్దరిల్లుతుండగానే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరో బాంబు పేల్చారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో తాను జరిపిన సమావేశాలను స్పైవేర్ నిఘాతో కేంద్రం వినేసిందన్నారు. గురువారం కోల్ కతాలో మీడియాతో మాట్లాడిన ఆమె, తన ఢిల్లీ పర్యటన, దేశంలో పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు..

పీకే ఫోన్‌లో పెగాసస్..
ప్రముఖులపై కేంద్ర సర్కారు నిఘాకు పాల్పడిందన్న ఉదంతం పూర్తిగా అవాస్తమని, పెగాసస్ స్పైవేర్ వాడినట్లు ప్రాథమిక ఆధారాలేవీ లేవని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో ప్రకటన చేసిన సమయంలోనే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్ కతాలో మీడియాతో మాట్లాడుతూ అనూహ్య విషయాలు వెల్లడించారు. స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో తాను జరిపిన సమావేశాలను పెగాసస్ స్పై వేర్ ని వినియోగించి ప్రభుత్వం నిఘా పెట్టిందని, పీకేతోపాటు మరికొందరి తోను కొన్ని రోజుల క్రితం తాను నిర్వహించిన మీటింగులపై నిఘా ఉందని.. ప్రశాంత్ కిషోర్ తన ఫోన్ ని 'ఆడిట్' చేయించగా వీటిలో ఒకటి పెగాసస్ ద్వారా వారికి (ప్రభుత్వానికి) తెలిసినట్టు ఆయన గుర్తించారని మమత వివరించారు.

దేశంలో సూపర్ ఎమర్జెన్సీ
కోల్ కతా కేంద్రంగా నడిచే దైనిక్ భాస్కర్ మీడియా సంస్థ యాజమాన్యం, జర్నలిస్టులపై ఐటీ దాడులను బెంగాల్ సీఎ మమత ఖండించారు. ''ఇటు ప్రశ్నించే వాళ్లపై దాడులు, అటు ప్రత్యర్థులపై పెగాసెస్ స్పైవేర్ నిఘా.. అసలేం జరుగుతోంది? దేశంలో 'సూపర్ ఎమర్జెన్సీ' సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్ లో వెలుగుచూసిన పెగాసస్ కుంభకోణం.. 1972లో అమెరికాలో జరిగిన వాటర్‌గ్రేడ్ కుంభకోణం కన్నా పెద్దది. అన్ని సంస్థలు పెగాసస్ బారిన పడ్డాయి. సొంత మంత్రులను కూడా మోడీ సర్కార్ నమ్మడం లేదు'' అని దీదీ అన్నారు.

దీదీకి మోదీ అపాయింట్మెంట్.. కడిగేస్తా
కొద్ది రోజుల కిందటే ప్రకటించినట్లు, తాను ఢిల్లీకి వెళ్లబోతున్నానని, పర్యటన షెడ్యూల్ దాదాపు ఖరారైందని, వచ్చేవారమే ఢిల్లీకి వెళ్లి 2-3 రోజుల పాటు అక్కడే ఉంటానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే అపాయింట్మెంట్ ఇచ్చారని, బెంగాల్ సమస్యలతోపాటు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తానని మమత చెప్పారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలను కూడా కలుసుకోనున్నట్లు ఆమె తెలిపారు. దేశంలో కొవిడ్ మూడో వేవ్ సూచనలు కనిపిస్తున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నదని మమత మండిపడ్డారు.












Click it and Unblock the Notifications