grammy awards 2024: గ్రామీ అవార్డులలో తళుక్కుమన్న భారత్; అవార్డు వరించిన సంగీతదిగ్గజాలు వీరే!!
సంగీత పరిశ్రమలో సాధించిన విజయాలను గుర్తించడానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇచ్చే పురస్కారం గ్రామీ అవార్డు. ఈ అవార్డుల ప్రధానోత్సవం ఈరోజు అత్యంత ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా నిర్వహించిన గ్రామీ అవార్డుల ప్రధానోత్సవంలో ప్రపంచ దేశాలకు చెందిన సంగీత కళాకారులు పాల్గొన్నారు. ఇక గ్రామీ అవార్డుల వేడుక ఆద్యంతం అద్భుతమైన పాటలతో, అందరిని ఆకట్టుకుంటూ కొనసాగింది .
ప్రపంచ ప్రఖ్యాత గ్రామీ 2024 మ్యూజిక్ అవార్డ్స్ లో భారతదేశం మరోమారు తళుక్కుమంది. ఈ అంతర్జాతీయ సంగీత వేదికపై భారతీయ సంగీత విద్వాంసులు తమ సత్తా చాటారు. భారతీయ సంగీత దిగ్గజాలైన ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్ ల ఫ్యూజన్ బ్యాండ్ 'శక్తి'కి బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు దక్కింది.

అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డును అందుకోవడానికి శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్ బృందం సభ్యులు లాస్ ఏంజెల్స్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్ ల శక్తి బ్యాండ్ పై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డును గెలుచుకున్న సందర్భంగా శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్ భారత్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ మేరకు వారు విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇదే సమయంలో మూడుసార్లు గ్రామీ అవార్డును దక్కించుకున్న ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ రికీ కేజ్ శంకర్ మహదేవన్ ప్రసంగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి తనదైన శైలిలో కొనియాడారు. శక్తి 2024 గ్రామీ అవార్డులను గెలుచుకుంది అని, ఈ ఆల్బమ్ ద్వారా నలుగురు గొప్ప భారతీయ సంగీతకారులకు ప్రపంచఖ్యాతి దక్కిందని ఆయన పేర్కొన్నారు.
శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్, ఫ్లూట్ ప్లేయర్ రాకేష్ చౌరాసియా, సెల్వ గణేష్, గణేష్ రాజగోపాలన్ తదితరుల ప్రతిభను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ ఆల్బమ్ ను జాన్ మెక్ లాగ్లిన్ (గిటార్), జాకీర్ హుస్సేన్ (తబ్లా), శంకర్ మహదేవన్ (సింగర్), వి సెల్వగనేశ్ (percussionist), గనేశ్ రాజాగోపాలన్ (violinist) ఇలా మొత్తం 8 మంది కలిసి కంపోజ్ చేశారు. భారతీయ సంగీతం గొప్పదనాన్ని విశ్వ వేదికపై చాటిన వీరికి ప్రముఖులు సైతం శుభాకాంక్షలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications