పెళ్లికి పిలిచి మందు పోయలేదట: పెళ్లికొడుకునే మర్డర్ చేసిన ఫ్రెండ్స్
స్నేహితులను పెళ్లికి పిలిస్తే, తాగినంత మందు పోయ లేదని చివరకు పెళ్లి కొడుకును హతమార్చిన ఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగడ్ సమీపంలోని ఒక గ్రామంలో జరిగిన ఈ సంఘటనలో పెళ్లయిన కాసేపటికే వరుడు హత్యకు గురికావడం వారి కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచేసింది. అయితే హత్యకు గురి కావడానికి గల కారణం అక్కడ ఉన్న వారందరికీ విస్మయం కలిగించింది.

వివాహం అయిన కాసేపటికే వరుడి హత్య
అలీగడ్ సమీపంలోని ఒక గ్రామంలో వివాహం చేసుకున్న కొద్ది గంటలకే వరుడు దారుణహత్యకు గురయ్యాడు. వివాహ వేడుకకు వచ్చిన స్నేహితులు వరుడు వారు వేడుకలను ఆస్వాదించడానికి కావలసినంత మద్యం ఇవ్వలేదన్న కారణంతో వరుడిని దారుణంగా కత్తితో పొడిచి చంపారు.
పాలిముకిమ్ పూర్ గ్రామంలో 28 ఏళ్ల బబ్లు వివాహం జరిగిన వెంటనే తన స్నేహితులను కలవడానికి వెళ్ళాడు. వారంతా మందు పార్టీలో ఉన్నారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతని స్నేహితులు అతని నుండి ఎక్కువ మద్యం డిమాండ్ చేశారు. కానీ బాధితుడు ఇక చాలని, ఇంకా మందు లేదని చెప్పడంతో ఘర్షణ చోటు చేసుకుంది.

పార్టీ ఇచ్చి అడిగినంత మద్యం పోయలేదని వరుడిని పొడిచి చంపిన స్నేహితులు
ఆగ్రహంతో అతని స్నేహితులలో ఒకరు అతన్ని కోపంతో పొడిచి చంపారని పోలీసులు చెప్తున్నారు . తీవ్ర గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. ఆసుపత్రికి తీసుకు వెళ్లే వరకే అతను మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు రామ్‌ఖిలాడిని మంగళవారం అరెస్టు చేసినట్లు సర్కిల్ ఆఫీసర్ నరేష్ సింగ్ బుధవారం తెలిపారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నందున ఇంకా అరెస్టు చేయలేదని, వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని సింగ్ తెలిపారు.
Recommended Video

యూపీలో ఇది మామూలే .. చిన్న చిన్న కారణాలకే హత్యలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట దారుణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి . ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతోంది. చిన్న చిన్న విషయాలకే హత్యలకు పాల్పడుతున్న ఘటనలు యూపీలో పోలీసులకు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఇటీవల రెండు వందల రూపాయల కోసం ఓ యువకుడు మరో వ్యక్తిని హతమార్చిన ఘటన అలీగడ్ నగరంలో చోటు చేసుకుంది. ఇప్పుడు తాజాగా పెళ్ళికి పిలిచి అడిగినంత మందు పోయలేదన్న కారణంతో ఏకంగా వరుడినే హతమార్చిన ఘటన చోటు చేసుకుంది .












Click it and Unblock the Notifications