గుజరాత్ ‘కేజ్రీవాల్’ హార్దిక్ : పాటిదార్ నేత అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పటేళ్లు, పాటిదార్లపైనే యావత్ దేశం ద్రుష్టి సారించింది. తమకు ఓబీసీ కోటాలో విద్యా ఉపాధి కోసం రిజర్వేషన్లు కల్పించాలని మూడేళ్ల క్రితం హార్దిక్ పటేల్ చేపట్టిన ఆందోళన.. పాటిదార్లను రాష్ట్రంలోని బీజేపీకి దూరం చేస్తున్నదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడినా కొద్దీ బీజేపీ నాయకులు.. పాటిదార్లు, వారి నాయకుల మనస్సు చూరగొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

'మహా చోర్' బీజేపీని ఓడించేందుకు 'చోర్' కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తే తప్పేం లేదని పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) కన్వీనర్ హార్దిక్ పటేల్ కుండబద్దలు కొట్టారు. కాకపోతే రిజర్వేషన్లపై నవంబర్ మూడో తేదీ లోపు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆల్టిమేటమ్ జారీ చేశారు అది వేరే సంగతనుకోండి.

 ఎన్నికల వేళ పాటిదార్లకు బీజేపీ ఇలా ప్రలోభాలు

ఎన్నికల వేళ పాటిదార్లకు బీజేపీ ఇలా ప్రలోభాలు

ఆందోళనకు దిగిన పాటిదార్లపై పోలీసులతో ఉక్కుపాదం మోపిన బీజేపీ సర్కార్.. తాజాగా వారి మదిని గెలుచుకునేందుకు సామ, దాన దండోపాయాలు ప్రదర్శిస్తున్నదని విమర్శలు ఉన్నాయి. హార్దిక్ పటేల్ తో కలిసి అత్యంత సన్నిహితంగా ఆందోళనలో పాల్గొన్న ఇద్దరు నేతలు బీజేపీలో చేరిపోయారు. మరో ‘పాస్' నేత నరేంద్ర పటేల్.. తాను పార్టీలో చేరడానికి రూ. కోటి ముడుపులు అందిస్తామని హామీ ఇచ్చిందని ఆరోపించారు. 48 గంటల్లోపే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉంటే రిజర్వేషన్లు సాధించుకోవచ్చునని పాటిదార్ల అరక్షణ్ ఆందోళన్ సమితి (పాస్) సరికొత్త వాదన తీసుకొచ్చింది.

గుజరాత్ కేజ్రీవాల్ హార్దిక్ పటేల్ అంటూ ఆరోపణలు

గుజరాత్ కేజ్రీవాల్ హార్దిక్ పటేల్ అంటూ ఆరోపణలు

వచ్చే ఎన్నికల్లో పాటిదార్లు బీజేపీకి మద్దతునిస్తారని పాటిదార్ అరక్షన్ సంఘర్ష్ సమితి (పాస్) జాతీయ కన్వీనర్ అశ్విన్ పటేల్ ఒక ప్రకటన చేశారు. ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాస్ కన్వీనర్ హార్దిక్ పటేల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాటిదార్లను ఆయుధంగా చేసుకుని తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం 14 మంది అమాయకుల ప్రాణాలు బలి చేశారని ఆరోపించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు, హార్దిక్ పటేల్‌కు తేడా లేదన్నారు. నాడు అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన ఆందోళనను అరవింద్ కేజ్రీవాల్ హైజాక్ చేసినట్లే, పాటిదార్ల ఉద్యమాన్ని హార్దిక్ పటేల్ తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం బలి చేశారన్నారు. ‘గుజరాత్' కేజ్రీవాల్ ‘హార్దిక్ పటేల్' అని కూడా అశ్విన్ పటేల్ ఆరోపించారు.

 బీజేపీ ప్రలోబాలను గమనిస్తున్న పాటిదార్లు

బీజేపీ ప్రలోబాలను గమనిస్తున్న పాటిదార్లు

పాటిదారు్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించడానికి కేంద్ర, రాష్ట్రాల్లో ఒక్క పార్టీ అధికారంలో ఉండటం వల్ల పాటిదార్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం సాధ్యం అవుతుందని అశ్విన్ పటేల్ చెప్పారు. గత వారం పాటిదార్లకు బీజేపీ రిజర్వేషన్లు కల్పించేందుకు తాము ఎలా ప్రణాళిక వేశారో గత వారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో జరిగిన సమావేశంలో తమకు చెప్పారని అశ్విన్ పటేల్ వివరించారు. కానీ 1995 నుంచి బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా పాటిదార్లందరి సంక్షేమానికి ఎందుకు చర్యలు తీసుకోలేదన్న విషయం అమిత్ షాను పాటిదార్లు ప్రశ్నిస్తున్నారు. పాటిదార్ల ఆందోళనను ఉక్కుపాదంతో అణచివేసినందుకు సూరత్‌లో అమిత్ షా నిర్వహించిన సమావేశంలో పాటిదార్లు వ్యక్తీకరించిన తీవ్ర నిరసన యావత్ దేశమంతటికి తెలుసు. కానీ పాటిదార్లకు రిజర్వేషన్లను అమలు చేయడానికి బీజేపీ ప్రణాళిక రూపొందించిందని ప్రలోభాలకు గురి చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలేమిటో గత వారం పది రోజులుగా వెలుగు చూస్తున్న పరిణామాలే చెప్తున్నాయి.

 20 శాతం ఈబీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ ఓకే

20 శాతం ఈబీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ ఓకే

ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం కల్పించిన 10 శాతం ఈబీసీ కోటా రిజర్వేషన్ అంశాన్ని హైకోర్టు కొట్టేసింది. అదీ కూడా ఓబీసీ కోటాలో రిజర్వేసన్ కల్పించాలని హార్దిక్ పటేల్ ఆందోళన ఉధ్రుతం చేసిన తర్వాతే సుమా. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దీనిపై స్పష్టత ఇవ్వాలని హార్దిక్ పటేల్ డిమాండ్ చేశారు. తమకు అధికారంలోకివస్తే 20 శాతం ఈబీసీ కోటా రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దీన్ని హార్దిక్ పటేల్ అంగీకరిస్తే ఆయన ‘పాస్'లో అంతర్గతంగా విభేదాలను ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో వచ్చేనెల మూడో తేదీ లోగా రిజర్వేషన్లపై తేల్చేయాలని కాంగ్రెస్ పార్టీకి హార్దిక్ పటేల్ షరతు విధించడం గమనార్హం.

 బీజేపీకి మద్దతునిచ్చిన పాటిదార్లు

బీజేపీకి మద్దతునిచ్చిన పాటిదార్లు

1980వ దశకం మధ్యలో అప్పటి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న రిజర్వేషన్ విధానానికి వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ఆందోళనలో పాటిదార్లు కూడా చేయి కలిపారు. నాటి నుంచి క్రమ క్రమంగా పాటిదార్లు, బీజేపీ విడదీయరాని భాగస్వాములుగా మారారు. మాధవ్ సింగ్ సోలంకి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడంలోనూ బీజేపీతోపాటు పాటిదార్లు కూడా కీలక పాత్ర పోషించారని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం కమలనాథులు తమను పక్కనబెట్టారని పాటిదార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్ల తర్వాత తాజాగా తమకు రిజర్వేషన్లు అమలు చేయకపోతే బీజేపీని వదిలేస్తామని పాటిదార్లు చెప్తున్నారు. రెండు దశాబ్దాల పాటు గుజరాత్ రాష్ట్రంలో కమలనాథులు అధికారంలో కొనసాగడానికి పాటిదార్లు ప్రధాన మద్దతుదారులుగా నిలిచారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని పాటిదార్లు వదిలి పెడతారా? అంటే మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలింది. పాటిదార్లు ఎవరి పక్షాన నిలువాలన్న విషయమై మూడో తేదీ లోగా కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయంపైనే ఆధార పడి ఉన్నది.

 కాంగ్రెస్ ‘ఖామ్' పొత్తు.. పాటిదార్ల ఆందోళనతో హింస

కాంగ్రెస్ ‘ఖామ్' పొత్తు.. పాటిదార్ల ఆందోళనతో హింస

1984 ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకు పరిమితమైన బీజేపీని గట్టెక్కించే బాధ్యతను పార్టీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ తన భుజస్కంధాలపైకెత్తుకున్నారు. అప్పటి సీఎం మాధవ్ సింగ్ సోలంకి, గుజరాత్ పీసీసీ అధ్యక్షుడు జినాభాయి దార్జి సంయుక్తంగా క్షత్రియులు, హరిజన్లు, ఆదివాసీలు, ముస్లింలతో కూడిన ‘ఖామ్' కూటమితో కలిసి పొత్తు పెట్టుకున్నారు. దీన్ని ‘ఖామ్' వర్గాలు స్వాగతించినా.. దీనికి వ్యతిరేకంగా పాటిదార్లు చేపట్టిన ఆందోళన.. గుజరాత్ రాష్ట్రంలో హింసకు దారి తీసింది. ఆస్తి, ప్రాణ నష్టానికి దారి తీసింది. ఈ ఆందోళనలో బీజేపీ కూడా పాల్పంచుకున్నది. తర్వాత క్రమంలో ‘కమలం' పార్టీ అంటే పటేళ్ల పార్టీ అన్న అభిప్రాయం ఏర్పడింది. సుదీర్ఘ కాలంగా బీజేపీ అధికారంలో కొనసాగడంతో పాటిదార్లలో చాలా మంది ప్రభుత్వ కాంట్రాక్టులు, ఇతర అవకాశాలు పొందిన వారు ఉన్నారు. గుజరాత్ ఎమ్మెల్యేల్లో మూడో వంతు పటేళ్లే అంటే ఆశ్చర్యం కాదు.

 2001లో కేశుభాయి పాలన వరకు పటేళ్లకు స్వర్ణయుగం

2001లో కేశుభాయి పాలన వరకు పటేళ్లకు స్వర్ణయుగం

గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం సీన్ మారిపోవడంతో పాటిదార్లు తమ పిల్లలకు ప్రత్యేకించి మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరే అవకాశాలు తగ్గిపోవడంతో ఆందోళన బాట పట్టారు. పాటిదార్ల మధ్య ఐక్యత సాధించేందుకు ‘పీ' అనే నినాదాన్ని వినియోగిస్తున్నారు. 2001 వరకు కేశూభాయ్ పటేల్ సీఎంగా ఉన్న హయాం నుంచి నరేంద్రమోదీ వరకు పాటిదార్లలోని ప్రముఖులకు స్వర్ణయుగంగా మారింది. పాటిదార్ల మనస్సు చూరగొన్న బీజేపీ బలోపేతం అవుతున్న 1993లోనే జన్మించిన హార్దిక్ పటేల్.. ఊహ వచ్చిన తర్వాత రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పార్టీ అధికారంలో ఉండటమే కనిపించింది. అహ్మదాబాద్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసినా ఉద్యోగ అవకాశాలు లేక ఆందోళన బాట పట్టారు హార్దిక్ పటేల్.

 2015లో హార్దిక్ పటేల్ సభకు ఐదు లక్షల మంది

2015లో హార్దిక్ పటేల్ సభకు ఐదు లక్షల మంది

మరోవైపు బీజేపీ ప్రభుత్వం 2014లో 81 సామాజిక వర్గాలు గల ఓబీసీలోకి 146 వర్గాలను చేర్చింది. ఈ నేపథ్యంలోనే రాజకీయాలకు అతీతంగా పటేళ్లు ‘పాస్' సారథ్యంలో ఆందోళన బాట పట్టారు. రిజర్వేషన్ల కోసం 2015 ఆగస్టులో అహ్మదాబాద్ లో హార్దిక్ పటేల్ నిర్వహించిన సభకు లక్షల మంది హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్త ఉద్యమం హింసాత్మకంగా మారిన తర్వాత జైలు పాలయ్యారు. కానీ రిజర్వేషన్లపై హార్దిక్ పటేల్ రాజీ పడలేదు. హార్దిక్ పటేల్ మొత్తం పాటిదార్ల ఓట్లలో 20 శాతం చీల్చగలరని రాజకీయాలకు అతీతంగా ఉండే జునాగడ్ వాసి కల్పేశ్ పటేల్ అనే టెక్కీ అన్నారు. ఇతర సామాజిక వర్గాల్లో వివిధ రకాలుగా విడిపోయినా.. ఈసారి పాటిదార్లు మూకుమ్మడిగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని జిగ్నేష్ షా అనే విద్యావేత్త చెప్తున్నారు. పాటిదార్లలో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు మంగళవారం సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్ అంతరా ‘రన్ ఫర్ యూనిటీ' పేరిట బీజేపీ ప్రదర్శనలకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ఈ ఎన్నికల్లో చాలా మంది పటేళ్లకు టిక్కెట్లు లభిస్తాయని వార్తలొస్తున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a major political development that may stir political equations in Gujarat, the Patidar Aarakshan Sangharsh Samiti (PASS) has announced to extend its support to BJP in the upcoming Assembly elections. PASS national convenor Ashwin Patel has accused Hardik Patel of betraying the Patidar community to gratify his political ambitions.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి