ఫోటో తీసేందుకు వెళ్తే.. యువతిని తొక్కి చంపిన ఏనుగు
తిరువనంతపురం: కేరళలో ఓ యువతిని ఏనుగు తన కాళ్లతో తొక్కి చంపింది. ఈ విషాద సంఘటన మంగళవారం నాడు రాష్ట్రంలోని ఇరుత్తుకనమ్‌లో చోటు చేసుకుంది. దీపావళి సందర్భంగా గుజరాత్ నర్మదా జిల్లా నుండి కేరళలో పర్యటించేందుకు ఓ బృందం వచ్చింది.
ఆ బృందం అంతా మంగళవారం నాడు ప్రయివేటు వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఓ ఏనుగుల సవారీ కేంద్రానికి వెళ్లింది. ఆ సమయంలో ఏనుగుతో ఫోటో తీయించుకోవడానికి ప్రయత్నించిన యువతిని, అది తన తొండంతో లాగి కిందకు పడేసింది. అనంతరం ఆమె శరీరం పైన కాలువేసి తొక్కడంతో యువతి అక్కడికి అక్కడే మృతి చెందింది. మృతి చెందిన యువతి వయస్సు 27.
మృతురాలి బాడీని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె మృతదేహాన్ని రేపు సొంత రాష్ట్రానికి పంపించనున్నారు. కాగా, కేరళ పర్యటన కోసం వచ్చిన ఆ బృందంలో మొత్తం 14 మంది ఉన్నారు.

ట్రాఫిక్ పోలీసుల ప్రథమ చికిత్స
బీహార్ రాజధాని పాట్నాలో ట్రాఫిక్ పోలీసులకు కొత్త బాధ్యతలు అప్పగించారు! ముఖ్యమైన జంక్షన్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఫస్ట్ ఎయిడ్ బాక్సులు అందించారు. వాహనదారులు ప్రమాదాల్లో గాయపడినట్టయితే, ట్రాఫిక్ పోలీసులు వారికి ప్రథమ చికిత్స చేస్తారు.
తొలుత ఐదు పోస్టుల్లో ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉంచుతారు. మొబైల్ పార్టీలకు కూడా ఈ బాక్సులు అందించామని ట్రాఫిక్ ఎస్పీ ప్రణ్‌తోష్ కుమార్ దాస్ మీడియాకు తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ భాగస్వామ్యంతో ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్సుల్లో కాటన్, బాండేజ్ క్లాత్, యాంటీసెప్టిక్ ఔషధాలు ఉంటాయని ఎస్పీ వివరించారు. ప్రమాదం జరిగినప్పుడు, అంబులెన్స్ వచ్చేలోపు, లేక, క్షతగాత్రుడిని డాక్టర్ వద్దకు తీసుకెళ్ళేలోపు జరిగే నష్టాన్ని నివారించడమే ఈ పథకం వెనకున్న ఉద్దేశమని తెలిపారు.












Click it and Unblock the Notifications