స్తంభించిన ఐటీ హబ్- భారీ బ్లాక్ అవుట్
దేశీయ ఐటీ హబ్ గా గుర్తింపు పొందిన గుర్గావ్ లో అనూహ్య పరిస్థితులు తలెత్తాయి. శుక్రవారం రాత్రి తీవ్ర విద్యుత్ సంక్షోభం తలెత్తింది. సెక్టర్-72లోని ప్రధాన విద్యుత్ కేంద్రం ట్రాన్స్‌ఫార్మర్ అకస్మాత్తుగా కాలిపోవడంతో పవర్ బ్లాక్ అవుట్ ఏర్పడింది. ఏకంగా ఏడు విద్యుత్ సబ్‌స్టేషన్లు నిలిచిపోయాయి. దీని ప్రభావం ఇళ్ల విద్యుత్ సరఫరాపైనే కాకుండా, రాపిడ్ మెట్రో సేవలను కూడా పడింది. కొన్ని గంటల పాటు స్తంభింపజేసింది. వేలాది మంది ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది.
గురుగ్రామ్‌లోని సెక్టర్-72లో 220 కేవీఏ సామర్థ్యం కలిగిన భారీ విద్యుత్ కేంద్రం ఉంది. పలు ప్రాంతాలకు ఇక్కడి నుంచే విద్యుత్‌ను అందుతుంది. ఇక్కడి ప్రధాన ట్రాన్స్‌ఫార్మర్ దెబ్బతినడంతో మొత్తం గ్రిడ్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. ఈ గ్రిడ్ పరిధిలోని ఏడు విద్యుత్ సబ్‌స్టేషన్లు ఆగిపోయాయి. సెక్టార్-15, సెక్టార్-38, సెక్టార్-44, సెక్టార్-46, సెక్టార్-52, సెక్టార్-56, మారుతికి చెందిన 66 కేవీఏ విద్యుత్ కేంద్రాలు వాటిలో ఉన్నాయి.

ఈ సబ్‌స్టేషన్ల నుండి విద్యుత్ సరఫరా పొందే అన్ని ప్రాంతాలు పూర్తిగా చీకటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా సెక్టార్-38 నుండి సెక్టార్-57 వరకు, సెక్టార్-15, సెక్టార్-18 ప్రాంతాల్లో విద్యుత్ పూర్తిగా నిలిచిపోయింది. దీనితో 70 శాతం గురుగ్రామ్ భారీ పవర్ బ్లాక్ అవుట్ తో అతలాకుతలం అయ్యింది. విద్యుత్ కోతతో రాపిడ్ మెట్రో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతిరోజు వేలాది మంది ప్రజలు రాపిడ్ మెట్రోలో రాకపోకలు సాగిస్తుంటారు. విద్యుత్ అంతరాయం కారణంగా మెట్రో సేవలు గంటకు పైగా నిలిచిపోవడంతో మెట్రోలో ఉన్నవారు తీవ్ర అవస్థలు పడ్డారు.
విద్యుత్ శాఖ అధికారుల అంచనా ప్రకారం, దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను మరమ్మతు చేయడానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది. ఈ తెల్లవారు జామున విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు సమాచారం అందింది. అప్పటివరకు ప్రభావిత ప్రాంతాల ప్రజలు చీకటి, తీవ్రమైన వేడిలో గడపాల్సి వచ్చింది. ఇప్పటికే గుర్గావ్ లో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. శుక్రవారం నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 42 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 43-44 డిగ్రీల సెల్సియస్ కు చేరింది.
రాత్రి పూట కూడా ప్రజలకు ఉపశమనం లభించడం లేదు; రాత్రి 10:30 గంటల ప్రాంతంలో కూడా ఉష్ణోగ్రత 33-35°C వద్ద ఉండటంతో, ప్రజలు ఉక్కపోత, వేడిమికి అల్లాడిపోయారు. గురుగ్రామ్ లో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. ఈ లోడ్ కారణంగా విద్యుత్ మౌలిక సదుపాయాలపై ఒత్తిడి అధికమవుతోంది. ఇటీవలే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేకు అనుసంధానించే భూగర్భ ఫీడర్ కేబుల్ వేడెక్కి మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో సుమారు 4500 కుటుంబాలకు విద్యుత్ సరఫరా దగ్గరగా 10 గంటల పాటు నిలిచిపోయింది.












Click it and Unblock the Notifications