ఈవీఎంలల్లో అనూహ్యంగా టర్న్: షాక్‌లో కాంగ్రెస్: తలకిందులు
Haryana Assembly Election Results 2024: ఓట్ల లెక్కింపు సందర్భంగా హర్యానాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. కౌటింగ్ కొనసాగుతున్న కొద్దీ కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. చేదు ఫలితాలు ఎదురవుతోన్నాయి. మొదట్లో సాధించిన భారీ ఆధిక్యత కాస్తా కొట్టుకుపోయింది. వెనుకంజలో పడింది.
ఇటీవలే జమ్మూ కాశ్మీర్, హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. కాశ్మీర్‌లో మూడు దశల్లో హర్యానాలో ఈ నెల 5వ తేదీన ఒకే విడతలో 90 చొప్పున నియోజకవర్గాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. తాజాగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ మొదలైంది.

ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే తొలి గంటలో హర్యానాలో కాంగ్రెస్ పార్టీ- దూసుకెళ్లింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేేసే దిశగా అడుగులు వేసింది. తొలి గంటలోనే భారీ మెజారిటీని సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మొత్తం 57 నియోజకవర్గాల్లో ఆధిక్యతలో కొనసాగారు.
భారతీయ జనతా పార్టీ వెనుకంజలో ఉంది. ఏ మాత్రం కూడా పోటీ ఇవ్వలేకపోయింది. తొలి గంటలో బీజేపీ 24 స్థానాల్లో ఆధిక్యతను సాధించింది అంతే. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్- 3, స్వతంత్ర అభ్యర్థులు ఎనిమిది చోట్ల లీడింగ్‌లో కొనసాగారు. ఆ తరువాతే పరిస్థితి తలకిందులైంది.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తెరిచిన తరువాత బీజేపీ ఒక్క ఉదుటున ఆధిక్యతను సాధించింది. ఈవీఎంలల్లో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ కాంగ్రెస్ ఆధిక్యత భారీగా తగ్గుతూ వచ్చింది. వెనుకంజలో నిలిచింది. పోటీ ఇవ్వలేని స్థితిలో కనిపించిన బీజేపీ ఒక్కసారిగా దూసుకెళ్లింది.
జులానా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్ సైతం వెనుకంజలో నిలిచారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీకి చెందిన కేప్టెన్ యోగేష్ బైరాగిపై 2,000 ఓట్లకు పైగా తేడాతో వెనుకపడ్డారు. దాదాపుగా 40 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు మెజారిటీ సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఉదయం 10:15 నిమిషాల సమయానికి బీజేపీ 51 నియోజకవర్గాల్లో ఆధిక్యతలో నిలిచింది. కాంగ్రెస్ అభ్యర్థులు 32 స్థానాలకే పరిమితం అయ్యారు. క్రమంగా కాంగ్రెస్ ఆధిక్యత సాధించిన సీట్ల సంఖ్య తగ్గడం కనిపించింది. స్వతంత్రులు నాలుగు చోట్ల, బహుజన్ సమాజ్‌వాది పార్టీ ఒక చోట ఆధిక్యతలో ఉన్నారు.












Click it and Unblock the Notifications