తాత, కొడుకు, మనవడు- ఆ కుటుంబానికి కంచుకోట
Haryana Assembly Election Results 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా తనయుడు ఆదిత్య సూర్జేవాలా ఘన విజయం సాధించారు. కైథల్ నియోజకవర్గంలో తన సమీప ప్రత్యర్థి, భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే లీలా రామ్‌ను మట్టికరిపించారు. 8,000లకు పైగా ఓట్ల తేడాతో విజయదుందుభి మోగించారు.
ఒకే కుటుంబానికి చెందిన మూడో తరం నాయకుడిగా చరిత్ర సృష్టించారు ఆదిత్య సూర్జేవాలా. ఒకే కుటుంబం, ఒకే నియోజకవర్గం నుంచి విజయం సాధించడం ఈ ఎన్నికల్లో హైలైట్‌గా చెప్పుకోవచ్చు. సూర్జేవాలా కుటుంబం నుంచి మూడోతరం నాయకుడిగా ఆదిత్యకు పట్టం కట్టారు కైథల్ ఓటర్లు.

ఆదిత్య సూర్జేవాలా తాత షంషేర్ సింగ్ సూర్జేవాలా 2005లో ఇదే కైథల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2009 నాటి ఎన్నికల్లో ఆయన కుమారుడు రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా అదే కాంగ్రెస్ టికెట్ మీద విజయ ఢంకా మోగించారు. ఈ రెండు ఎన్నికల్లో బీజేపీకి చెందిన కైలాష్ భగత్.. వారిద్దరి చేతిలో పరాజయం పాలయ్యారు.
2014 నాటి ఎన్నికల్లో మరోసారి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా కైథల్ నుంచి గెలిచారు. మరోసారి కైలాష్ భగత్‌ను ఓడించారు. 2019 నాటికి పరిస్థితి అడ్డం తిరిగింది. అప్పటి ఎన్నికల్లో రణ్‌దీప్‌ను పరాజయం పలకరించింది. లీలా రామ్ చేతిలో 1,246 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత ఎక్కువగా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు.
ఇప్పుడు మళ్లీ సూర్జేవాలా కుటుంబానికే పట్టం కట్టారు కైథల్ ఓటర్లు. ఈ సారి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా తనయుడు ఆదిత్యకు ఘన విజయాన్ని అందించారు. 8,000లకు పైగా ఓటల తేడాతో గెలిపించారు. సూర్జేవాలా చేతిలో సిట్టింగ్ ఎమ్మెల్యే లీలా రామ్ పరాజయాన్ని చవి చూశారు. తమ కుటంబానికి వెన్నుదన్నుగా ఉంటూ వస్తోన్న కైథల్ ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications