Haryana Crisis: హర్యానా సీఎం ఖట్టర్ రాజీనామా-జేజేపీకు గుడ్ బై-సొంతంగా బీజేపీ సర్కార్..
హర్యానాలో ఐదేళ్లుగా జన్ నాయక్ జనతా పార్టీ (జేజేపీ)తో కలిసి ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న బీజేపీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఇవాళ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో హర్యానా ప్రభుత్వం కుప్పకూలింది. దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీతో విభేదాలు తారా స్ధాయికి చేరడంతో ఎన్నికల వేళ ఆ పార్టీని వదిలించుకోవాలని నిర్ణయించుకున్న బీజేపీ.. ఈ దిశగా అడుగులేసింది. ఖట్టర్ ను ఈసారి లోక్ సభ ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోంది.
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ-జేజేపీ పొత్తులో భాగంగా సీట్ల పంపకాలపై మొదలైన ప్రతిష్టంభన ప్రభుత్వం కుప్పకూలే వరకూ వచ్చింది. రాష్ట్రంలోని 10 ఎంపీ సీట్లలో రెండింటిని తమకు కేటాయించాల్సిందేనని జేజేపీ చేసిన డిమాండ్ ను బీజేపీ అంగీకరించలేదు. దీంతో ఇరు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టాయి. చివరకు లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ బీజేపీ అధిష్టానం తమ ముఖ్యమంత్రి ఖట్టర్ తో రాజీనామా చేయించింది.

కాసేపట్లో బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోబోతోంది. ప్రభుత్వం నుంచి జేజేపీని తప్పించి ఆ స్ధానంలో ఇండిపెండెంట్లు, చిన్న పార్టీల్ని కలుపుకుని సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం 90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్‌కు 30, జెజెపికి 10, ఐఎన్‌ఎల్‌డి , హర్యానా లోఖిత్ పార్టీకి ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నారు. వీరు కాకుండా 7 మంది స్వతంత్రులు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా బీజేపీకి ఉన్న 41 మందికి తోడు స్వతంత్రుల్ని కలుపుకుంటే సరిపోతుంది.












Click it and Unblock the Notifications