అరవింద్ కేజ్రీవాల్‌కు హర్యానా కోర్టు సమన్లు, ఎందుకంటే?
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు హర్యానా కోర్టు సమన్లు జారీ చేసింది. ఢిల్లీ నీటి సరఫరాను అడ్డుకునేందుకు హర్యానా పాలకులు యమునా నదిని విషపూరితం చేశారంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. దీంతో కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై హర్యానా ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేజ్రీవాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది.
యమునా నది నీటిని విషపూరితం చేసినట్లు అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే చేసిన అసత్య వ్యాఖ్యలతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్‌కు హర్యానా కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 17న కోర్టులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

అంతేగాక, ఆరోజు విచారణకు హాజరుకాకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ సోనిపట్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు నోటీసుల్లో స్పష్టం చేసింది. కేజ్రీవాల్ తన ఆరోపణల వెనుక ఉన్న కారణాలను వివరించాలని, హర్యానా ప్రభుత్వం యమునా నది నీటిని విషపూరితం చేస్తుందన్న వాదనలను ధృవీకరిస్తూ నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది.
కాగా, కేజ్రీవాల్ వ్యాఖ్యలపై హర్యానా మంత్రి విపుల్ గోయల్ తీవ్రంగా స్పందించారు. కేజ్రీవాల్ తమ ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ఆరోపణల వల్ల హర్యానా, ఢిల్లీ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారన్నారు. కేజ్రీవాల్ నిరాధార ఆరోపణల చేస్తుంటే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కేజ్రీవాల్ ఆరోపణలు అవాస్తవమని నిరూపిస్తామన్నారు.
మరోవైపు, కేజ్రీవాల్ ఆరోపణల నేపథ్యంలో హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ యమునా నదిలో నీటిని తాగారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేజ్రీవాల్ దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఈరోజు యమునా నీరు తాగినట్లు తెలిపారు. అయితే, నయాబ్ సింగ్ సైనీ యమునా నది నీటిని తాగినట్లు నటించి.. ఆ తర్వాత ఉమ్మివేశారని కేజ్రీవాల్ ఆ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు. వారు తాగలేని నీటిని ఢిల్లీ ప్రజలకు ఇవ్వాలని చూస్తున్నారన్నారు. అయితే, యమునా నీటిని తాను రోజు తాగుతున్నట్లు ప్రధాని మోడీ చెప్పారు. ప్రధాని తాగే నీటిలో విషం కలుపుతారా? అని అరవింద్ కేజ్రీవాల్‌కు కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications