హర్యానాలో హ్యాట్రిక్ విక్టరీ: బీజేపీలోకి సావిత్రి జిందాల్ సహా ముగ్గురు ఎమ్మెల్యేలు
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. బీజేపీ ఇక్కడ 48 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ప్రకటించడం గమనార్హం.
హర్యానా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో భారత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఆమెతోపాటు స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన దేవేందర్ కడ్యాన్, రాజేశ్ జూన్ బీజేపీ కీలక నేతలతో భేటీ అయ్యారు. హర్యానా పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ నివాసంలో దేవేందర్, రాజేశ్ లు ఆ పార్టీలో చేరారు. అయితే, సావిత్రి జిందాల్ మాత్రం బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

కాగా, సావిత్రి జిందాల్ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2005, 2009లో హిస్సార్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సావిత్రి జిందాల్ బీజేపీ టికెట్ పై ఈ స్థానం నుంచి పోటీలో నిలుస్తారని అంతా భావించారు. అయితే, ఆ పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు.
అయితే, హర్యానా ఎన్నికల్లో బీజేపీ మూడోసారి అత్యధిక సీట్లతో అధికారంలోకి రావడంతో.. తిరిగి బీజేపీకి దగ్గరయ్యేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాను బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు సావిత్రి జిందాల్ ప్రకటించారు. దీంతో బీజేపీకి వచ్చిన 48 సీట్లతోపాటు ఈ ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతుగా బీజేపీ బలం 51కి పెరగడం గమనార్హం.
#WATCH | Delhi: Independent MLA from Haryana's Hisar Assembly seat, Savitri Jindal extends support to BJP
— ANI (@ANI) October 9, 2024
She says, "...For the development of Hisar, I have decided to support the BJP government." pic.twitter.com/nfWA7bjcVd
కాగా, గనౌర్ నుంచి బీజేపీ రెబల్‌గా బరిలోకి దిగి గెలుపొందారు కడ్యాన్. కాంగ్రెస్ అభ్యర్థి కులదీప్ శర్మపై 35,209 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. బహదూర్‌గఢ్ నుంచి కాంగ్రెస్ రెబల్ గా బరిలోకి దిగిన రాజేశ్ బీజేపీ అభ్యర్థి దినేష్ కౌశిక్‌ను ఓడించారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరిపోయారు.
#WATCH | Delhi | Haryana CM Nayab Singh Saini says, "The credit to this huge victory goes to PM Modi who has made such policies and schemes in the last 10 years which have benefitted poor, farmer, youth, women. His schemes are for every section of the society. This victory is the… pic.twitter.com/v04ouyRg6U
— ANI (@ANI) October 9, 2024
ఇది ఇలావుండగా, హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని బుధవారం కలిశారు. హర్యానాలో బీజేపీ విజయానికి ప్రధాని మోడీ అమలు చేసిన విధానాలు, పథకాలే కారణమని సైనీ తెలిపారు. గత పదేళ్లలో పేదలు, రైతులు, మహిళలు, యువతతోపాటు సమాజంలోని అన్ని వర్గాల కోసం ఎన్నో పథకాలు అమలు చేసినట్లు వెల్లడించారు. ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా ఉన్నా.. ప్రజల మద్దతుతోనే హర్యానాలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. ఓడిపోయిన ప్రతిసారీ ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేయడం కాంగ్రెస్ పార్టీకి పరిపాటిగా మారిందని సైనీ విమర్శించారు.












Click it and Unblock the Notifications