కేదార్ నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. మున్ముందు వర్షాల తీవ్రత మరింత అధికంగా ఉండొచ్చు కూడా. ఇప్పటికే భారత వాతావరణ కేంద్రం ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేదార్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తుల భద్రత దృష్ట్యా ఈ ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. యాత్రీకుల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. దీనిపై గర్వాల్ కమిషనర్ ఆనంద్ స్వరూప్ మాట్లాడారు. ప్రతికూల వాతావరణం కారణంగా యాత్రికులను తాత్కాలికంగా ఆపినట్లు వివరించారు. వాతావరణం సాధారణ స్థితికి వచ్చి, మార్గం సురక్షితమని నిర్ధారించిన తర్వాతే అనుమతిస్తామని అన్నారు.

అప్పటి వరకు శ్రీనగర్‌తో సహా నిర్దేశిత కేంద్రాలలో వేచి ఉండాలని ఆదేశించారు. భారత వాతావరణ కేంద్రం ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు, ఎత్తైన ప్రాంతాల్లో హిమపాతం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. తాజా బులెటిన్ ప్రకారం, 3,500 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న చాలా కొండ ప్రాంతాలు, హరిద్వార్‌లలో ఇలాంటి వాతావరణమే ఉంటుంది.
ఉధమ్ సింగ్ నగర్ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. మరోవైపు ఉత్తరకాశీ, రుద్రప్రయాగ, చమోలి, బాగేశ్వర్, పిథోరాగఢ్ జిల్లాల్లో 3,800 మీటర్ల ఎత్తులో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు, హిమపాతం పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అలాగే 4,000 మీటర్ల పైనున్న పర్వత ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఉరుములు, మంచు కురుస్తాయని తెలియజేసింది.
ప్రతికూల వాతావరణం ప్రయాణ, తీర్థయాత్ర కార్యకలాపాలను ప్రభావితం చేయవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, యాత్రికులు, స్థానిక ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంగా సూచించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. వర్షాల తీవ్రత నాలుగైదు రోజుల వరకు ఉండొచ్చని అంచనావేసింది. దీంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా కేదార్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.












Click it and Unblock the Notifications