పోటెత్తిన ఓటర్లు-రికార్డులన్నీ బద్దలు..! సీఎం పేరూ చెప్పేసిన బీజేపీ..!
దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా గమనిస్తున్న తమిళనాడు, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం ఆరు గంటలకు ఇరు రాష్ట్రాల్లోనూ అధికారికంగా పోలింగా్ ముగిసింది. అయితే అప్పటికే పోలింగ్ బూత్ లలో క్యూల్లో నిలబడిన ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. మండుటెండల్ని సైతం లెక్కచేయకుండా భారీఎత్తున తరలివచ్చారు. దీంతో గత ఎన్నికల రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రెండింటిలోనూ గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం (Voter Turnout) పెరిగిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ముఖ్యంగా ఇరు చోట్లా సాయంత్రానికల్లా పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం, తమిళనాడులో సాయంత్రం 7 గంటల వరకు 84.29 శాతం ఓటింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లో అయితే ఏకంగా 91.35 శాతం పోలింగ్ నమోదైంది. ఇంకా క్యూల్లో నిలబడిన ఓటర్లు కూడా ఓటేస్తే ఈ శాతాలు సరికొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది.

మరోవైపు తమిళనాడు, పశ్చిమబెంగాల్లో జరిగిన ఓటింగ్ పై బీజేపీ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. తమిళనాడు, బెంగాల్లో విజయం తమదేనన్నారు. తమిళనాడులో మే 4న వెలువడే ఫలితాల తర్వాత అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి సీఎం కావడం ఖాయమని ఆయన తేల్చేశారు. అలాగే పశ్చిమబెంగాల్లోనూ ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం శుద్ధి చేసిన తర్వాత రెండున్నరేళ్లుగా తాము అక్కడ పడుతున్న కృషి ఫలించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు పూర్తిగా శాంతి భద్రతల్ని గాలికొదిలేశాయని పీయూష్ గోయల్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications