బెంగాల్ లో ఫలితాలను తారుమారు చేసే కెపాసిటీ ఉన్న 59 స్థానాలు
కొన్ని రోజుల పాటు హోరాహోరీగా కొనసాగిన ఎన్నికల ప్రచారం అనంతరం అసలు యుద్ధానికి తెర లేచింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో నేడు పోలింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశలో 152 స్థానాలకు ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ఆరంభమైంది. రెండు దశల్లో ఇక్కడ ఓటింగ్ జరుగనుంది. మిగిలిన స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ నిర్వహిస్తారు. తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలకు నేడు ఒకే దశలో ఓటింగ్ ముగియనుంది.
తమిళనాడులో మొత్తం 5.67 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశలో దాదాపు 3.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు వేయనున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC), భారతీయ జనతా పార్టీ మధ్య టగ్ ఆఫ్ వార్ నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అత్యంత ఉత్కంఠభరితమైన పోరు నెలకొంది.

డార్జిలింగ్, కాలింపాంగ్, జల్ పాయ్ గురి, అలిపుర్ దార్, కూచ్ బెహార్, ఉత్తర దినాజ్ పూర్, దక్షిణ దినాజ్‌పూర్, మాల్దా, ముర్షిదాబాద్, బీర్భూమ్, పశ్చిమ బర్ధమాన్, పురూలియా, బంకురా, ఝర్‌గ్రామ్, పశ్చిమ మెదినీపూర్, పుర్బా మెదినీపూర్ జిల్లాల్లో పోలింగ్ ఉంటుంది. ఈ రౌండ్‌లో మొత్తం 1,478 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశను నాలుగు జిల్లాల పరిధిలోని 59 నియోజకవర్గాలు నిర్దేశించనున్నాయి. తొలిదశలో ఓటింగ్ జరిగే 152 స్థానాల్లో 39 శాతం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముర్షిదాబాద్, బాంకురా, పురూలియా, ఈస్ట్ మిడ్నాపూర్ వంటి కీలక జిల్లాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన ఆధిపత్యం కనిపించట్లేదు. ముర్షిదాబాద్‌లో బహుముఖ పోటీ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్, సీపీఎంలకు గణనీయ ప్రభావం ఉంది.
2024 లోక్‌సభల ఎన్నికల్లో తృణమూల్ అధిక సెగ్మెంట్లలో ఆధిక్యం కనబరిచినా, బీజేపీ, కాంగ్రెస్‌లకు కూడా కొన్ని ప్రాంతాల్లో పట్టుంది. 2021 అసెంబ్లీలో తృణమూల్ జిల్లాను స్వీప్ చేయగా, బీజేపీకి రెండు సీట్లే దక్కాయి. బంకురాలో తీవ్ర పోటీ నెలకొంది. గత రెండు ఎన్నికల్లో బీజేపీ, తృణమూల్ సమాన ఓట్ల శాతాన్ని, సీట్లను పంచుకున్నాయి. వ్యవసాయ సంక్షోభం, మౌలిక వసతుల లేమి, ఆరోగ్య సంరక్షణ వంటి స్థానిక సమస్యలు ఇక్కడ ఓటర్లను ప్రభావితం చేస్తాయి.
పురూలియాలో 2021 అసెంబ్లీలో బీజేపీకి పైచేయి సాధించింది. 2024 లోక్‌సభలో తృణమూల్ పుంజుకుంది. నీటి కొరత, పారిశ్రామిక వృద్ధి లేమి వంటి ఆర్థిక సవాళ్లు ఓటర్లకు కీలకం. తూర్పు మిడ్నాపూర్ అత్యంత కీలకం. సీనియర్ నాయకులు బరిలో ఉండటం వల్ల ఇక్కడి పోటీకి ప్రాధాన్యత ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బలంగా ఉన్నా, గత అసెంబ్లీలో తృణమూల్ మెరుగ్గా కనబరిచింది. నందిగ్రామ్ ఈ పోరుకు కేంద్ర బిందువు.
ఖరగ్‌పూర్ సదర్‌లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే దిలీప్ ఘోష్, టీఎంసీ ప్రదీప్ సర్కార్‌తో తలపడుతున్నారు. ఈ స్థానంలో ప్రతీసారి కొత్త పార్టీ గెలుస్తుంటుంది. అసన్‌సోల్ దక్షిణ్ స్థానంలో బీజేపీ అగ్నిమిత్ర పాల్, టీఎంసీ తపస్ బెనర్జీ, ఇతరులతో బహుముఖ పోటీని ఎదుర్కొంటున్నారు. సిలిగురిలో బీజేపీ అభ్యర్థి శంకర్ ఘోష్.. టీఎంసీకి గట్టిపోటీ ఇస్తోన్నారు. డార్జిలింగ్ కొండ ప్రాంతాల్లో బీజేపీ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి టీఎంసీ వ్యూహాత్మకంగా రిటైర్డ్ విద్యావేత్తను బరిలోకి దించింది.












Click it and Unblock the Notifications