తమిళనాడు ఎన్నికల్లో వారికే ఓటేయండి..! ఓటర్లకు ఓవైసీ షాకింగ్ పిలుపు..!
తమిళనాడు(Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇవాళే చివరి రోజు. దీంతో రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్య గట్టి పోటీ నెలకొందన్న సర్వేల అంచనాలతో అన్ని పార్టీలు అప్రమత్తంగా ఉన్నాయి. ప్రతీ ఓటూ కీలకంగా భావిస్తున్నాయి. అసలే విజయ్ కొత్త పార్టీ టీవీకే ఎవరి ఓట్లు చీలుస్తుందో తెలియక ప్రధాన పార్టీలు ఆందోళనలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో తమిళ ఓటర్లకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) కీలక విజ్ఞప్తి చేశారు.
ఎంఐఎం పార్టీ తరఫున అసదుద్దీన్ ఓవైసీ ఓ వీడియో విడుదల చేశారు. తమిళ ఓటర్లను ఉద్దేశించి విడుదల చేసిన ఈ వీడియోలో ఓవైసీ.. ఈ నెల 23న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ఓటర్లు డీఎంకే-కాంగ్రెస్ కూటమికి అండగా నిలవాలని ఓవైసీ కోరారు. మీ ఆశీర్వాదం, మద్దతుతో స్టాలిన్ తిరిగి అధికారంలోకి వస్తారని ఆశిస్తున్నట్లు ఓవైసీ తెలిపారు. తమిళనాడు ఎంఐఎం అధ్యక్షుడు వకీల్ అహ్మద్ కూడా ఇప్పటికే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమికి మద్దతు ప్రకటించారని ఓవైసీ గుర్తుచేశారు. కాబట్టి ఈ నెల 23న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి అభ్యర్ధులకు అనుకూలంగా ఓటు వేయాలని తమిళనాడు ఓటర్లను ఓవైసీ కోరారు.

I request all voters of Tamil Nadu to cast their precious vote on April 23rd and make all DMK (@arivalayam) alliance candidates victorious.@mkstalin @KanimozhiDMK pic.twitter.com/46KaMhB1sD
— Asaduddin Owaisi (@asadowaisi) April 20, 2026
తమిళనాడులో ముస్లిం మైనార్టీ ఓటర్ల జనాభా భారీగానే ఉంది. చాలా నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు కీలకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో డీఎంకే కూటమికి మద్దతుగా ఓటు వేయాలని ఓటర్లను ఓవైసీ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాల్లో పోటీకి దిగడం ద్వారా సెక్యులర్ పార్టీల ఓట్లను చీల్చి బీజేపీ గెలుపుకు దోహదం చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న ఓవైసీ .. ఈసారి మాత్రం తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (ఎస్పీఏ)కు మద్దతుగా నిలవడం విశేషం.












Click it and Unblock the Notifications