HPV: బాలికలకు కేంద్రం ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్-ఎందుకంటే ?
దేశవ్యాప్తంగా మహిళల్ని సర్వైకల్ క్యాన్సర్ బారి నుంచి రక్షించేందుకు కేంద్రం ఓ భారీ కార్యక్రమం చేపడుతోంది. ఇందులో భాగంగా 14 ఏళ్ల వయస్సుకన్న బాలికలకు ప్రత్యేక హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) టీకా వేయబోతున్నారు. గతేడాది కేంద్ర బడ్జెట్ లో ఈ మేరకు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకేసారి ఈ డ్రైవ్ చేపడతారు.
మహిళల్లో పెరిగిపోతున్న గర్భాశయ క్యాన్సర్ సమస్యను అధిగమించేందుకు కేంద్రం ఈ హెచ్పీపీ వ్యాక్సిన్ ను ఇవ్వబోతోంది. బాలికలకు కౌమార దశలోనే ఈ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో వారికి గర్భాశయ క్యాన్సర్ రాకుండా అడ్డుకట్ట వేయొచ్చని కేంద్రం చెబుతోంది. ఈ కార్యక్రమం కింద 2027 నాటికి 2.6 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యాక్సిన్ అలయన్స్ గవి మద్దతుతో భారత్ కు కోటి కంటే ఎక్కువ డోస్‌లను సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రచారంలో ఉపయోగించబోయే వ్యాక్సిన్ మెర్క్ తయారు చేసిన గార్డాసిల్.

కౌమార దశలో ఉన్న బాలికలకు ఈ వ్యాక్సిన్ డోస్ ఇవ్వడం ద్వారా బలమైన, మన్నికైన రక్షణ లభిస్తుందని శాస్త్రీయ ఆధారాలు చూపిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒకసారి దేశవ్యాప్తంగా ఈ డ్రైవ్ చేపట్టిన తర్వాత ఈ టీకాను జాతీయ రోగనిరోధక వ్యాక్సిన్ల షెడ్యూల్ లో చేరుస్తారు. దీంతో ఇకపై ప్రత్యేకంగా ఇలాంటి డ్రైవ్ చేపట్టాల్సిన అవసరం లేకుండానే బాలికలకు ఇది అందుబాటులో ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ కేసులు గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నారు. ఈ డ్రైవ్ అమలులోకి వచ్చిన తర్వాత అర్హత ఉన్న తమ కుమార్తెలు టీకాను పొందేలా చూసుకోవాలని అధికారులు దేశవ్యాప్తంగా తల్లిదండ్రులు మరియు సంరక్షకులను కోరారు.












Click it and Unblock the Notifications