ఇల్లు కుప్పకూలి నలుగురి సజీవ సమాధి
బళ్లారి: నిద్రపోతున్న సమయంలో ఇల్లు కుప్పకూలిపోయి ఒకే కుటుంబానికి చెందిననలుగురు సజీవ సమాధి అయిన సంఘటన కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో జరిగింది. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి ఇద్దరిని ప్రాణాలతో బయటకు తీశారు.
ఇద్దరు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. బళ్లారి జిల్లా హూవినహడగలి (పూల హడగలి)లో వీరభద్రప్ప అనే ఆయన నివాసం ఉంటున్నారు. ఈయన కుటుంబ సభ్యులు మంజునాథ్, ఓబుళమ్మ (65), రత్నమ్మ (25), ఈరమ్మ (2), కుసుమా (4).

గురువారం రాత్రి అందరూ భోజనం చేసి నిద్రపోయారు. శుక్రవారం వేకువ జామున 2 గంటల సమయంలో వీరు నివాసం ఉంటున్న ఇల్లు కుప్పకూలిపోయింది. పెద్ద చప్పుడు రావడంతో స్థానికులు నిద్రలేచి చూశారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వీరభద్రప్ప, మంజునాథ్ లను ప్రాణాలతో రక్షించి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఓబుళమ్మ, రత్నమ్మ, ఈరమ్మ, కుసుమా సజీవ సమాధి అయ్యారు. ఇల్లు కూలిపోవడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications