ముంబై ఉగ్రదాడి నిందితుడు తహావుర్ రాణా.. డాక్టర్ నుంచి నరహంతకుడిగా ఎలా మారాడు..?
2008 నవంబర్ 26 భారతదేశానికి ఒక బ్లాక్ డే. ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకడైన అజ్మల్ కసబ్‌ను సజీవంగా పట్టుకొని విచారణ అనంతరం ఉరితీయడం జరిగింది. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రధాన నిందితుడిగా పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడైన తహవూర్ రాణా ఉన్నారు. ప్రస్తుతం అతడి వయస్సు 64 ఏళ్లు. 2009లో అతన్ని fbi అరెస్ట్ చేయగా.. రాణాను తాత్కాలికంగా తమకు అప్పగించాలంటూ జూన్ 2020లో అమెరికాను భారత్ అభ్యర్థించింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో.. సైతం తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించాలని కోరారు. అందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమోదించారు. దీంతో ట్రంప్‌కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. తర్వత రాణాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు జనవరి 25, 2024న ఆమోదం తెలిపింది. దాంతో ఈ కేసులో తనను తప్పుగా దోషిగా ప్రకటించారని చెప్పి రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు రాణా. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ క్రమంలోనే అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో రాణాను ఈరోజు ఢిల్లీకి తీసుకొచ్చారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కార్యాలయానికి తీసుకెళ్తారు.

డాక్టర్ నుంచి నరహంతకుడిగా..
తాహావూర్ రాణాకు కాలేజీ రోజుల్లో మరో కుట్రదారు పాకిస్థానీ అమెరికన్ డేవిడ్ కోల్మన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీతో పరిచయం ఏర్పడింది. పాక్ ఆర్మీలో డాక్టర్ అయిన రాణా 1997లో మేజర్ హోదాలో రిటైర్ అయ్యారు. ఆ తర్వాత కెనడా వెళ్లి ఆ దేశ పౌరుడిగా మారి వ్యాపారం చేస్తూ ఉన్నారు. అనంతరం రాణా USAలో వీసా ఏజెన్సీ పెట్టగా.. ముంబైలోని కీలక లక్ష్యాలపై నిఘా పెట్టిన హెడ్లీ అతడిని కలిశాడు.
దాంతో రాణా.. హెడ్లీకి ప్రయాణ పత్రాలు సులభంగా ఇప్పించడంలో కీలక పాత్ర పోషించాడు. ముంబైలో రాణా వీసా ఏజెన్సీ ద్వారా హెడ్డ్లీ.. తరుచూ ముంబై వచ్చి దాడులు చేయాలనుకున్న ప్రాంతాల్లో రెక్కి నిర్వహించినట్టు సమాచారం. చివరగా పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఏజెన్సీ సహకారంతో ఉగ్రవాదులు ముంబైలో దాడికి పాల్పడ్డారు. అంతే కాకుండా కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాలో సైతం రాణా చురుకైన పాత్ర పోషించినట్టు చెబుతున్నారు.
విచారణ..
ఇక పాటియాలా న్యాయస్థానం ఎదుట రాణాను హాజరు పరచనున్నారని సమాచారం. ఇప్పటికే అందుకు సంబంధించి పాటియాలా కోర్టు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రయల్ కోర్టు రికార్డులను సైతం పాటియాలా కోర్టుకు తరలించారు. ఇక ఈ కేసును వాదించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరేందర్ మాన్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications