రాహుల్ గాంధీకి శాపంగా 2013 నాటి తప్పు ? అప్పుడు యూపీఏ ఆర్డినెన్స్ ను వ్యతిరేకించకపోయుంటే..?
ప్రధాని మోడీపై పరువునష్టం వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దీని ప్రకారం రాహుల్ గాంధీ ఎంపీగా తన సభ్యత్వం కోల్పోనున్నారు. ఇలా దోషులుగా తేలిన ప్రజాప్రతినిథుల్ని వెంటనే అనర్హుల్నిచేయకుండా అప్పీలు చేసుకునే హక్కు కల్పిస్తూ ప్రజాప్రతినిధ్య చట్టంలో ఉన్న అవకాశాన్ని సుప్రీంకోర్టు 2013లో కొట్టేసింది. దీనిపై రాహుల్ గాంధీ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ఆయనకు శాపంగా మారింది.
2013లో లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఓ కీలక తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం క్రిమినల్ కేసుల్లో దోషులుగా కోర్టులు నిర్ధారణ అయి రెండేళ్లు జైలుశిక్ష పడిన ప్రజాప్రతినిధులకు పైకోర్టుల్లో అప్పీలు చేసుకునేందుకు మూడునెలలు సమయం ఇస్తూ ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఉన్న నిబంధనను సుప్రీంకోర్టు కొట్టేసింది. అంటే ఇలా దోషులుగా నిర్ధారణ కాగానే వెంటనే సదరు ప్రజాప్రతినిధి తన పదవిని కోల్పోతాడన్న మాట. దీనిపై అప్పట్లో అధికారంలో ఉన్న యూపీఏ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

2013లో అప్పటి యూపీఏ సర్కార్ లో భాగస్వామిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి స్కాంలో చిక్కుకుని దోషిగా నిర్ధారణ కావడంతో రెండేళ్ల జైలుశిక్ష పడింది. దీంతో ఆయన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అనర్హుడిగా మారతారు. దీన్ని అడ్డుకునేందుకు యూపీఏ సర్కార్ తన భాగస్వామిని రక్షించుకోవాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ చట్టసవరణ చేస్తూ ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్ పైకోర్టును ఆశ్రయించే అవకాశం దక్కింది. కానీ అప్పట్లో తెరవెనుక నుంచి యూపీఏ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రాహుల్ గాంధీ.. ఈ ఆర్డినెన్స్ ను బహిరంగంగానే వ్యతిరేకించారు.

ఇలాంటి చెత్త ఆర్డినెన్స్ ను తాను చూడలేదని, దీన్ని చించి చెత్తబుట్టలో వేయాలంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలు యూపీఏ ప్రభుత్వంలో మంటపుట్టించాయి. వెంటనే ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ ఆర్డినెన్స్ ను వెనక్కితీసుకుంటూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అంతే ఈ ఆర్డినెన్స్ తో బయటపడ్డానని భావించిన లాలూ ప్రసాద్ కాస్తా ఆనర్హత వేటుకు గురయ్యారు. అప్పుడు అదే ఆర్డినెన్స్ చట్టరూపం దాల్చి ఉంటే ఇప్పుడు రాహుల్ గాంధీ సూరత్ కోర్టు తీర్పుపై పైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉండేది. అది కార్యరూపం దాల్చకపోవడంతో రాహుల్ స్వయంకృతం ఇప్పుడు ఆయనకే చుట్టుకుని ఎంపీ పదవికి చేటు తెచ్చేలా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications