కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు వెనుక సునీల్ కానుగోలు వ్యూహాలు ? నెక్స్ట్ తెలంగాణలో !
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ సాధించిన భారీ విజయం అధికార బీజేపీకే కాదు కాకలు తీరిన రాజకీయ యోధులకు సైతం షాకిచ్చింది. ముఖ్యంగా ఉత్తరాది తరహాలో మతపరమైన భావోద్వేగాల్ని రెచ్చగొట్టి గెలవాలనుకున్న బీజేపీకి షాకిస్తూ అభివృద్ధి, సంక్షేమ మంత్రంతో ముందుకెళ్లిన కాంగ్రెస్.. ఊహించని విజయాలు అందుకుంటోంది. దీని వెనుక రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు వ్యూహాలు ఉన్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో పాటు కాంగ్రెస్ మ్యానిఫెస్టో, అభ్యర్ధుల ఎంపిక వెనుక సునీల్ రచించిన వ్యూహాలు ఫలించాయి.
పెద్దగా ప్రచారం లేకుండా, ఫొటోలు, హంగామా లేకుండా తన పని తాను చేసుకుపోయే వ్యూహకర్తగా సునీల్ కానుగోలుకు పేరుంది. ఎన్నికల వ్యూహాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సైతం సలహాలు ఇస్తూ క్రమంగా కీలకంగా మారిపోయారు. గతేడాది బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం మొదలుపెట్టిన సునీల్.. తన స్వరాష్ట్రం కర్నాటకలో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యతను భుజాను వేసుకున్నారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్ధాయి వ్యూహకర్తగా కూడా మారారు. కర్నాటకలో బీజేపీ మరోసారి గెలవకుండా అడ్డుకునేందుకు రోజుకు 20 గంటలు, వారానికి 7 రోజుల చొప్పున పనిచేశారు.

సునీల్ కానుగోలు కాంగ్రెస్‌లో చేరే నాటికి కర్నాటక కాంగ్రెస్ వర్గపోరుతో సతమతం అవుతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో రాహుల్-ప్రియాంక మద్దతుతో వ్యూహాలు రచించే బాధ్యత తీసుకున్న సునీల్.. కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు కోసం పని మొదలుపెట్టారు. సీఎం బస్వరాజ్ బొమ్మైకు సన్నిహితుడైన సునీల్ కానుగోలును తిరిగి బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా సున్నితంగా తిరస్కరించారు. అప్పుడే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ప్లాన్ చేశారు. దీంతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ రాహుల్ గాంధీ నడిచారు. అలాగే కర్నాటకలోనూ డీకే శివకుమార్, సిద్ధరామయ్య వర్గాల్ని ఏకతాటిపైకి తెచ్చారు.

కర్నాటకలో కాంగ్రెస్ గెలుపుకు పనిచేసిన రాహుల్ భారత్ జోడో యాత్రతో పాటు అభ్యర్ధుల ఎంపిక, మ్యానిఫెస్టో తయారీ, అందులో పలు సంక్షేమ పథకాల ఎంపిక వెనుక సునీల్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కర్నాటకలో విజయంతో సునీల్.. ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారిపోయారు. వీటిలోనూ కనీసం రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు విజయం అందించినా సునీల్ వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు జాతీయ వ్యూహాలు రచించే ఛాన్స్ దక్కనుంది.












Click it and Unblock the Notifications