వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లను ఎలా గుర్తించాలి? మోసపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు

మీరేదో పనిలో ఉండగా మీ ఫేస్‍బుక్ మెసెంజర్‍లో ఒక పింగ్ వస్తుంది. తెరిచి చూస్తే, మీకు పరిచయం ఉన్న పేరు, ఫోటో నుంచి ఒక పలకరింపు. మీరు సమాధానమిస్తారు. మీరు హలో అనగానే, వాళ్లు, "హలో.. నేను ఆస్పత్రి దగ్గర ఉన్నాను. మా అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది. వెంటనే డబ్బు పంపండి. వీలైనంత త్వరగా తిరిగి ఇచ్చేస్తాను" అని మెసేజ్ పెడతారు.

మీరు అది నమ్మి, ఎప్పుడు జరిగింది, ఏం జరిగిందనే వివరాలు కనుక్కుంటారు.

వెంటనే వాళ్లు "డబ్బు పంపండి త్వరగా, ఈ నెంబర్‍కు గూగుల్ పే చేయండి" అంటూ ఒక ఫోన్ నంబర్ ఇస్తారు.

ఇలాంటి మెసేజులను నమ్మి మీరు వెంటనే డబ్బులు వేశారంటే, అంతే సంగతులు. అవసరం ఏ మనిషికైనా, ఎలా అయినా ఏర్పడవచ్చు, మనిషికి మనిషి సహాయం చేయాల్సిన పరిస్థితి ఎప్పుడైనా పుట్టవచ్చు. దాన్నే ఆసరాగా తీసుకుని కొంతమంది దుండగలు ఫేస్బుక్, ఇన్‍స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‍ఫార్మ్‌లలో ఫేక్ అకౌంట్లు సృష్టించి, అమాయకులను మోసం చేస్తున్నారు. వీరి బారిన పడకుండా ఉండడానికి మనం సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా మసలుకోవాలి.

సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు

ఫేక్ అకౌంట్ అంటే ఏమిటి? వాటి ద్వారా ఎలాంటి మోసాలు చేస్తుంటారు?

ఫేక్ అకౌంట్ అంటే వేరొకరి పేరు, వివరాలు, ఫోటోలు వాడి అకౌంట్ క్రియేట్ చేయడం. వారి పేరు మీద మోసాలు చేయడం, బూటకపు కార్యకలాపాలు నడపడం. పబ్లిక్ డొమెన్‍లో ఉన్న వివరాలను తీసుకుని ఈ ఫేక్ అకౌంట్లు సృష్టిస్తారు.

మనకి తెలిసున్నవాళ్లు గానీ, లేదా అపరిచితులు గానీ, లేక కొన్ని క్రిమినల్ గ్రూప్స్ గానీ ఈ పని చేయవచ్చు. వీటిని క్రియేట్ చేయడానికి దొంగ ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్స్ వాడవచ్చు. అయితే, ఈ వివరాలు సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపించవు కాబట్టి, ఫేక్ అకౌంట్లను సులువుగా నమ్మేయడానికి వీలుంటుంది.

ఫేక్ అకౌంట్లను ఆసరాగా చేసుకుని చేస్తున్న మోసాల్లో కొన్ని రకాలు:

  • అసలు అకౌంట్ వారి స్నేహితులకి డబ్బు కోసం అభ్యర్థనలు పంపి, ఆ డబ్బుని తమ ఖాతాలో జమ చేసుకోవడం
  • ఫాలోవర్స్‌కి అసలు అకౌంట్ వారి గురించి తప్పుడు సమాచారం అందించడం (ఉదా: వారికి ప్రమాదం జరిగిందనో, వారేదో స్కామ్‍లో ఇరుక్కున్నారనో పోస్టులు చేయడం)
  • అశ్లీల/అసభ్య కంటెంట్ షేర్ చేసి అసలు అకౌంట్ వారికి చెడ్డ పేరు వచ్చేలా చేయడం.
  • చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు నడిపి (ఉదా: డ్రగ్స్ కొనుక్కోడానికి వివరాలు ఇవ్వడం, కొట్లాటలు పుకార్లు లేపడం వంటివి) ఆ నేరం అసలు అకౌంట్ వారి వైపుకి మళ్లించడం
  • ఫేక్ ట్రెండ్స్, బాట్ (bot) మెసేజీలలో భాగంగా ఈ అకౌంట్‍ను వాడుకోవడం.

ఫేక్ అకౌంట్ల బెడద సెలబ్రిటీలకే పరిమితం కాదు

సెలబ్రిటీలకి, ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న ఇన్‍ఫ్లుయన్సర్లకి ఫేక్ అకౌంట్ల బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకే వేర్వేరు సోషల్ మీడియా వేదికలలో వారికి 'వెరిఫైడ్ అకౌంట్ స్టేటస్' ఇస్తారు. ఆ ఖాతా తమదేనని సరిపడా డాక్యుమెంట్స్ అందిస్తే, అది సరైన అకౌంట్ అని నిర్థారించుకున్నాక సోషల్ మీడియా వేదికలు వాటిని ఆమోదిస్తాయి . అలాంటివారి అకౌంట్ ఓపెన్ చేయగానే పేరు పక్కన ఒక గుర్తు ఉంటుంది. ఉదా: నీలం రంగులో ఉండే టిక్ మార్క్. దీని బట్టి వారి ఫాన్స్‌కు నిజమైన అకౌంట్‍ను ఫాలో అవ్వడం తేలికవుతుంది.

అయితే ఈ టిక్ మార్క్ అనేది సామాన్యులకు అందుబాటులో వచ్చే అవకాశం ఉండదు. దానికి దరఖాస్తు పెట్టుకోవాలన్నా లక్షల్లో ఫాలోవర్లు ఉండాలి. సెలబ్రిటీలకు ఫేక్ అకౌంట్ల బెడద ఎక్కువే గానీ, వాళ్లకు మాత్రమే ఆ బెడద అనుకుంటే మాత్రం పొరపాటు.

ఎందుకంటే, ఫేక్ అకౌంట్స్ సృష్టించకుండా నిలువరించే విధివిధానాలు చాలా వరకూ సోషల్ మీడియా వేదికల వద్ద లేవు. దీన్ని అవకాశంగా తీసుకుని, 'ఎంత దొరికితే అంత' అన్న తీరులో, కొన్ని ముఠాలు అదే పనిగా సామాన్యుల ఫేక్ అకౌంట్లను సృష్టించి వారికి నష్టం కలిగిస్తున్నాయి.

ఫేక్ అకౌంట్లను గుర్తించడమెలా?

మనం మనిషిని మొహం చూసి ఎలా గుర్తుపడతామో, అలాగే ఆన్‍లైన్ ప్రోఫైల్‌ అనగానే పేరు, ఫోటోతో గుర్తుపెట్టుకుంటాం. అయితే, ఈ రెండూ చాలా ఈజీగా కాపీ చేయగలుగుతారు దుండగలు. అందుకని, మనకి తెలిసినవారి పేరు మీద ఏదైనా అనుమానస్పద మెసేజీలు గానీ, పోస్టులుగానీ కనిపించగానే, ఈ కిందివి గమనించుకోవాలి

  • ఈ ప్రొఫైల్‍లో ఎంత మంది స్నేహితులు/ఫాలోవర్స్ ఉన్నారు? మీకు తెలిసినవారు ఎంత మంది ఉన్నారు?
  • ప్రొఫై‌ల్‌ని ఎప్పుడు సృష్టించారు? తేదీ, టైమ్ చూడాలి.
  • ప్రొఫైల్‌ వాల్ మీద పోస్ట్స్ ఎంత పాతవి ఉన్నాయి? మొత్తం ఎన్ని ఉన్నాయి?
  • ప్రొఫైల్ ఐడీ ఏముంది? ఉదాహరణకు, మీ స్నేహితుడి పేరు 'గురజాడ అప్పారావు' అయుంటే, ప్రొఫైల్ ఐడీ facebook.com/gurajada.apparao అని ఉంటుంది. అదే దొంగ అకౌంట్ అయితే, 'facebook.com/guj1290834@...' అనే ఏదో కల్పిత ఐడీ ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుందంటే, ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడానికి ఒక ప్రత్యేక స్క్రిప్ట్ వాడతారు. దాన్లో అక్షరాలు, నెంబర్లు వచ్చేస్తాయి.

ఫేక్ అకౌంట్స్ కనిపించగానే ఏం చేయాలి?

ఫేక్ అకౌంట్ అని గుర్తించగానే, ఈ కింది పనులు చేయవచ్చు.

  • అన్నింటికన్నా ముందుగా ఆ దొంగ ఆకౌంట్ మీద క్లిక్ చేసి 'రిపోర్ట్' అన్న ఆప్షన్ మీద నొక్కి, రిపోర్ట్ చేయాలి. దాదాపుగా ప్రతీ ప్లాట్‍ఫార్మ్ ఇలాంటి వెసులుబాటు ఇస్తుంది. దాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి.
  • ఫేక్ అకౌంట్ మీ పేరు మీద క్రియేట్ అయితే, మీ అసలు అకౌంట్ నుంచి "ఇలా ఒక ఫేక్ అకౌంట్ వచ్చింది. దయచేసి దాన్ని నమ్మవద్దు. వీలైతే రిపోర్ట్ చేయండి" అని మీ ఫ్రెండ్స్/ఫాలోవర్స్‌కు తెలియజేయాలి.
  • ఒకవేళ మీ స్నేహితులది అయితే, వారిని వెంటనే అలర్ట్ చేసి, పై విధంగా పోస్టు పెట్టేలా ప్రోత్సహించాలి.
  • ఇతరులు మీ అసలు ప్రొఫైల్ గుర్తుపట్టే విధంగా మీ ప్రొఫైల్ పిక్చర్ మార్చవచ్చు.
  • ఎంత ఎక్కువ మంది 'రిపోర్ట్' చేస్తే అంత త్వరగా ఫేక్ అకౌంట్‍ను తొలగించే వీలుంటుంది.
  • కొన్ని గంటల వ్యవధి నుంచి కొన్ని రోజులలోపు ఫేక్ అకౌంట్ తొలగించకపోతే, ఆ ప్లాట్‍ఫార్మ్‌కు రాతపూర్వకంగా కంప్లైంట్ చేయాలి. లేదా సైబర్ పోలీస్‍కి రిపోర్ట్ చేయాలి.

సోషల్ మీడియాలో ప్రొఫైల్స్ క్రియేట్ చేసి మర్చిపోవడం మంచి పద్ధతి కాదు. ఏదన్నా అకౌంట్ వాడకపోతుంటే దాన్ని డీయాక్టివేట్ చేయడం మేలు. లేకపోతే దానికి ఫేక్ అకౌంట్ సృష్టించి తగని పనులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు

ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించకుండా ఉండాలంటే…

ప్రస్తుతం ఫేక్ ప్రొఫైల్స్‌కి ఎవరూ అతీతులు కారు. సోషల్ మీడియా కంపెనీలు ఈ సమస్యను తీవ్రమైనదిగా పరిగణించి, భారీ ఎత్తున ఏవైనా చర్యలు చేపడితేగానీ, వీటి నుంచి విముక్తి ఉండదు.

ప్రస్తుతానికైతే మనం అప్రమత్తంగా ఉండి, ఏదైనా అనుమానస్పదంగా కనిపించగానే తగిన చర్యలు తీసుకోవాలి.

గుడ్డిగా దేన్నీ నమ్మకూడదు. అప్పుడే ఈ ఫేక్ ప్రొఫైల్స్ బారినుంచి మనల్ని, మనవారిని, మన చుట్టుపక్కలవారిని కాపాడుకోగలుగుతాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
How to spot fake accounts on social media? What are the precautions to be taken to avoid being cheated?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X