Typhoon Dolphin: భారత్ లో వర్షాల్ని అడ్డుకుంటున్న అదృశ్య శక్తి-4 వేల కి.మీ నుంచే..!
తూర్పు చైనాను భారీ వర్షాలు, ఈదురుగాలులతో కుదిపేసిన డాల్ఫిన్ తీవ్ర తుఫాను (Typhoon Dolphin)ప్రభావం భారత్ పై పరోక్షంగా పడుతోంది. ఆగస్టు 9న జెజియాంగ్ ప్రావిన్స్‌లోని యుహువాన్ సమీపంలో దాదాపు గంటకు 151 కిలోమీటర్ల వేగంతో తీరం దాటిన ఈ తుఫాను చైనాలో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించగా, వేల మైళ్ల దూరంలో ఉన్న భారత్‌లో మాత్రం రుతుపవనాలు (Southwest Monsoon)బలహీనపడ్డాయి. చైనా వైపు భారీ కుండపోత వర్షాలకు దారితీసిన వాతావరణ పరిస్థితులు.. భారత ఉపఖండంలో రుతుపవనాల వ్యవస్థను మాత్రం బలహీనపరుస్తున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం తీవ్రమైన అలజడి కొనసాగుతోంది. పసిఫిక్ ఉపరితల వాతావరణంలో సంభవిస్తున్న ఈ భారీ మార్పులు భారత్‌లో వర్షాల వ్యవస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒకదాని వెనుక ఒకటిగా ఏర్పడుతున్న చురుకైన తుఫానులు భారత్ లో రుతుపవనాల్ని దెబ్బతీస్తూ తీవ్ర అవరోధంగా మారుతున్నాయి. వీటి ప్రభావంతో బంగాళాఖాతంలో రుతుపవనాల క్రియాశీలత భారీగా తగ్గిపోయే ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఏడాది పసిఫిక్ జోన్‌లో చోటుచేసుకుంటున్న ఎలినినో పరిస్థితులు భారత్ లో వర్షాల గమనాన్ని మరింత సంక్లిష్టంగా మార్చాయి. దీనివల్ల వాతావరణ ప్రసరణ అంతా పసిఫిక్ వైపే కేంద్రీకృతమవుతోంది. ఇలాంటి సమయాల్లో మేఘాలు హిందూ మహాసముద్రం నుండి తూర్పు వైపునకు మళ్లుతాయి. తద్వారా భారత్‌లో సకాలంలో కురవాల్సిన కీలక వర్షాల వ్యవస్థల సృష్టి మందగిస్తుంది. ఇది సాధారణంగా వర్షాలు కురిపించే బంగాళాఖాతంలో ద్రోణుల్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడే మూడింట ఒక వంతు అల్పపీడనాలు పసిఫిక్ తుఫానుల చలనం ఆధారంగానే ఊపందుకుంటాయి. కానీ ప్రస్తుత క్లిష్టమైన ప్రతికూల గాలుల వల్ల ఈ సానుకూల ప్రభావం భారత్‌కు దక్కడం లేదు.

దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే మేఘాల సాంద్రత తగ్గిపోవడమే కాకుండా, బంగాళాఖాతంలో వర్షాల ద్రోణులు ఆశించిన స్థాయిలో ఏర్పడటం లేదు. చైనాను తాకిన డాల్ఫిన్ తుఫాను నేరుగా వచ్చి భారత వర్షాలను లాక్కోకపోయినా, పసిఫిక్ వ్యాప్తంగా విస్తరించి ఉన్న అల్లకల్లోల వాతావరణ ప్రక్రియలో ఇది ఊహించని పరిణామంగా నిపుణులు చెప్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో పసిఫిక్ సముద్ర అలజడులు బంగాళాఖాతంలో అనుకూల అల్పపీడనాన్ని సృష్టిస్తాయా లేదా ఎలినినో ప్రభావంతో రుతుపవనాలను మరింత నిర్వీర్యం చేస్తాయా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మరో రెండు వారాల్లో ఏదో ఒక మార్పు జరగబోతోందని శాస్త్రవేత్తల అంచనా.




Click it and Unblock the Notifications