దానికి నేను ఏ మాత్రం సిగ్గుపడటం లేదు: మళ్ళీ ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు
జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలిగా నియ్యమితురాలైన ఖుష్బూ మరోమారు తండ్రి లైంగిక వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమితురాలైన ఖుష్బూ సుందర్ చిన్నప్పుడు తాను లైంగిక వేధింపులకు గురయ్యారని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన తండ్రి తన పైన చిన్నతనంలో లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని కుష్బూ చేసిన వ్యాఖ్యలు ప్రతీ ఒక్కరినీ షాక్ కు గురిచేశాయి. ఇక తాజాగా మరోమారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఖుష్బూ ఆ వ్యాఖ్యలకు కొనసాగింపుగా మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలకు తాను చెప్పదలుచుకుంది చెప్పారు.

మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేసిన ఖుష్బూ సుందర్
తండ్రి పైన సంచలన వ్యాఖ్యలు చేసిన ఖుష్బూ తాజాగా మరో మరో తాను చేసిన వ్యాఖ్యలకు తను ఏమాత్రం సిగ్గుపడడం లేదన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని బయట ప్రపంచానికి చెప్పినందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా, నిజాయితీగా అందరికీ తెలిసేలా చెప్పానని ఖుష్బూ పేర్కొన్నారు. ఇక ఆ ఘటనలో తను బాధితురాలినని పేర్కొన్న ఖుష్బూ ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి తన తండ్రి కాబట్టి అతను సిగ్గుపడాలంటూ వ్యాఖ్యలు చేశారు.

వేధింపులను భరించొద్దు.. ధైర్యంగా బయటకు రావాలి
ఇక ఇదే సమయంలో మహిళలందరూ ధైర్యంగా ముందుకు రావాలని, ముందడుగు వేయాలని, మిమ్మల్ని కించపరిచే విషయాల పట్ల సహనం అవసరం లేదని ఖుష్బూ పేర్కొన్నారు. మిమ్మల్ని కించపరిచే విషయాలను పొరపాటున కూడా ప్రోత్సహించకూడదన్నారు. నాకు జరిగిన అన్యాయాన్ని చెప్పడానికి నేను చాలా టైమ్ తీసుకున్నానని, కానీ ఎవరికైనా ఇటువంటి అన్యాయం జరిగితే వెంటనే బయటకు వచ్చి ధైర్యంగా బయటకు చెప్పాలని యూత్ కు ఖుష్బూ మెసేజ్ ఇచ్చారు. మహిళల స్వేచ్ఛ, స్వతంత్ర్యాలను, వారి ఆత్మగౌరవాన్ని హరించే హక్కు ఎవరికీ లేదని ఖుష్బూ ఈ వ్యాఖ్యల ద్వారా అందరికీ తెలిసేలా చెప్పారు.

జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలిగా ఖుష్బూ బాధ్యత చేపట్టాక కీలక వ్యాఖ్యలు
బిజెపి నాయకురాలుగా ఉన్న ఖుష్బూ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, బాల్యంలో చిన్న పిల్లలు సైతం ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను గురించి అందరికీ అర్థమయ్యేలా తన జీవితంలో జరిగిన సంఘటనలను ఉదాహరణగా చెప్పి, తిరుగుబాటు చేయాలని చెప్పారు. తాను ఎనిమిదేళ్ళ వయసులోనే తన తండ్రి వల్ల లైంగిక వేధింపులకు గురయ్యానని, తల్లికి చెప్పినా ఆమె తన మాట వినిపించుకునేది కాదని చెప్పారు. తనకు 15 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత తాను తండ్రిపై తిరుగుబాటు చేశానని ఖుష్బూ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications