మోదీని దించేంత వరకూ కన్నుముయ్య
Mallikarjun Kharge: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌లో చివరి విడత పోలింగ్‌కు గడువు సమీపిస్తోంది. చివరి విడత పోలింగ్ అక్టోబర్ 1వ తేదీన జరగాల్సి ఉంది. ఈ నెల 18, 25 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ పూర్తయింది. మొత్తం 11 నియోజకవర్గాల్లో 1వ తేదీన ఉదయం 7 గంటలకు తుది పోలింగ్ ఆరంభం కానుంది.
ఈ దశలో 12,00,977 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 6,19,000 మంది పురుషులు, 5,81,887 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వారి కోసం ఆయా నియోజకవర్గాల పరిధిలో 1,494 పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.

ఈ పరిణామాల మధ్య కథువాలో పర్యటించారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్, ఇతర నాయకులు మాట్లాడిన తరువాత సభను ఉద్దేశించి ప్రసంగించడానికి ఖర్గే రెడీ అయ్యారు.
ప్రసంగాన్ని ఆరంభించిన కొద్ది సేపటికే తడబడ్డారు. నిల్చోలేకపోయారు. ఒక్కసారిగా తూలికింద పడబోయారు. ఆయన పక్కనే ఉన్న భద్రత సిబ్బంది, వేదికపై ఉన్న నాయకులు ఆయనను పట్టుకున్నారు. ఆ తరువాత ఎంతో సేపు మాట్లాడలేకపోయారాయన. క్లుప్తంగా ప్రసంగించారు.
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వడానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు ఖర్గే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని, ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు.
తన వయస్సు 83 సంవత్సరాలని, ఇప్పుడిప్పుడు చనిపోననీ మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పదవి నుంచి దించేంత వరకు కన్నుమూయనని చెప్పారు. అప్పటివరకు బతికే ఉంటానని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సిన అవపరం ఉందని, అంత తొందరగా ప్రాణాలను వదలబోనని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications