మళ్లీ నేనే వస్తా: జమ్ము కాశ్మీర్‌లో పలు శంకుస్థాపనల అనంతరం ప్రధాని కీలక వ్యాఖ్యలు
లెహ్: రెండోసారి తానే అధికారంలోకి వస్తానని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ధీమా వ్యక్తం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని ఎన్డీయే తిరిగి అద్భుత విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన జమ్ము కాశ్మీర్‌లోని లెహ్‌లో మాట్లాడారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన రెండోసారి అధికారంలోకి రావడంపై విశ్వాసం వ్యక్తం చేశారు.

మళ్లీ నేనే వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తా
ఈరోజు తన చేతుల మీదుగా కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగాయని, ఆ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలను కూడా మళ్లీ తానే వచ్చి చేస్తానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. అలాంటి పాడుబడ్డ సంస్కృతికి తమ ప్రభుత్వంలో చరమగీతం పాడిందని చెప్పారు. బీజేపీ పాలనలో అభివృద్ధి ఇలాగే కొనసాగుతుందన్నారు.
విభజన రాజకీయాలు తరిమికొట్టాం
లక్ష్యసిద్ధి లేని సంస్కృతిని, విభజన రాజకీయాలను ఈ అయిదేళ్ల పాలనలో దేశం నుంచి తరిమికొట్టామని ప్రధాని పిలుపునిచ్చారు. ఎలాంటి ఆలస్యం లేకుండా బడ్జెట్‌లో చిన్న, సన్నకారు రైతులకు ప్రకటించిన సాయాన్ని వేగంగా అందజేసే ప్రక్రియ చేపట్టామని తెలిపారు. మొదటి విడత సాయంగా అయిదు ఎకరాల్లోపు రైతుందరికీ రూ.2వేలు అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు. పథకం అమలు కోసం అర్హుల పేర్లు, ఆధార్ నెంబర్లను అందజేయాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శాకాలు జారీ చేశామన్నారు. వీలయినంత త్వరలో వారికి ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి సాయం అందుతుందన్నారు.
కాశ్మీరీ పండిట్ల గౌరవాన్ని కాపాడుతాం
కాశ్మీరీ పండిట్ల అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. పండిట్ల హక్కులు, గౌరవాన్ని కాపాడేలా తమ ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. హింసాత్మక ఘటనలకు, తీవ్రవాదానికి బెదిరి ఇక్కడి నుంచి కాశ్మీరి పండిట్లు వెళ్లిపోవడం బాధాకరమైన చరిత్ర అన్నారు. అలాంటివి ఉండవన్నారు.












Click it and Unblock the Notifications