కుప్పకూలిన భారత యుద్ధ విమానం- తునాతునకలు
రాజస్థాన్ లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన ప్రతిష్ఠాత్మక ఫైటర్ జెట్ కుప్పకూలింది. తునాతునకలైంది. ఈ ఘటనలో పైలెట్ కన్నుమూశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కొద్దిసేపటి కిందటే చురు జిల్లాలో ఈ దుర్ఘటన సంభవించింది. సూరత్ గఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సమీపంలో ఈ యుద్ధ విమానం కుప్పకూలింది. జాగ్వార్ రకానికి చెందిన యుద్ధ విమానం అది. వైమానిక దళం అమ్ములపొదిలో అత్యంత ప్రాధాన్యత ఉన్నాయి వీటికి. గత దశాబ్దంలో జాగ్వార్ యుద్ధ విమానాలు ప్రమాదానికి గురి కావడం చాలా అరుదు.

సాధారణంగా జాగ్వార్ ఫైటర్ జెట్లు.. యాంత్రిక లోపాలు లేదా తక్కువ ఎత్తులో శిక్షణ పొందేటప్పుడు, పైలట్ లోపాల వల్ల మాత్రమే ప్రమాదానికి గురి అవుతుంటాయి. తాజా ప్రమాదం కూడా యాంత్రిక లోపాల వల్లే చోటు చేసుకుని ఉండొచ్చని వైమానిక దళాధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తోన్నారు.
జాగ్వార్ విమానాలను 1970 దశకంలో వైమానిక దళంలో ప్రవేశపెట్టారు. కాలక్రమేణా ఈ విమానాల నిర్వహణకు సంబంధించిన సవాళ్లు ఎదురవుతున్నాయి. జర్నల్ ఆఫ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 2019లో చేసిన అధ్యయనం ప్రకారం- పాత విమానాలకు సాంకేతిక లోపాల కారణంగా ప్రమాదాల రేటు 30 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది.
ఈ ప్రమాదం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎదుర్కొంటున్న సవాళ్లను మరోసారి గుర్తుచేస్తోంది. ఆధునిక విమానాలను సమకూర్చుకోవడం, పైలట్లకు నిరంతర శిక్షణ ఇవ్వడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను తగ్గించవచ్చని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. IAF తన విమానాల భద్రత, సమర్థతను నిర్ధారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications