పోలీసాఫీసర్‌కే దిక్కులేకుంటే, మామూలు అమ్మాయిల మాటేమిటి: హైకోర్టు
న్యూఢిల్లీ: తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినవారిపై పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ ఓ మహిళా పోలీసు పెట్టుకున్న దరఖాస్తును తోసిపుచ్చుతూ వారికి గుణపాఠం చెప్పాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీ నగరంలో మహిళా పోలీసు అధికారికే రక్షణ లేకపోతే మామూలు అమ్మాయిల పరిస్థితేమిటని కోర్టు అడిగింది.
ఢిల్లీ మహిళా పోలీసు కానిస్టేబుల్‌పై అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనకు సంబంధించిన విచారణలో జస్టిస్ ప్రతిభా రాణి ఆ వ్యాఖ్యలు చేశారు. విధులు ముగిసిన తర్వాత ఇంటికి తిరిగి వస్తుండగా రాత్రి పది గంటల ప్రాంతంలో మహిళా కానిస్టేబుల్ పట్ల దుండగులు అసభ్యంగా ప్రవర్తించారు.
నిందితులు ముగ్గురు ఆ మహిళను వెంబడిస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఆమె చేయి పట్టుకుని లాగారు. దానిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఆ ముగ్గురు కూడా తమ ప్రాంతంలో ఉంటారని ఆమెకు తెలిసింది.

ఆ యువకులు క్షమాపణ చెప్పడం, ఇతరులు జోక్యం చేసుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో కేసును ఉపసంహరించుకోవడానికి మహిళా కానిస్టేబుల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, మహిళా కానిస్టేబుల్‌తో జస్టిస్ ప్రతిభా రాణి ఏకీభవించలేదు.
మహిళల పట్ల గౌరవం లేకపోవడం పట్ల నిందితులపై మండిపడ్డారు. అక్కడికక్కడే మహిళా కానిస్టేబుల్ వారికి బుద్ధి చెప్పి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో మహిళా కానిస్టేబుల్ ఒంటరిగా ఉండవచ్చునని, ఇప్పుడు కోర్టు ఆమె వెంట ఉందని, నిందితులకు తగిన గుణపాఠం చెబుతుందని, దాంతో వాళ్లు అటువంటి చర్యలకు మళ్లీ దిగబోరని అన్నారు. తల్లిదండ్రులను కోర్టుకు తీసుకురావాలని న్యాయమూర్తి నిందితులను ఆదేశించారు. ఎఫ్ఐర్‌ను కొట్టేయడానికి నిరాకరించారు. వీధుల్లో ఢిల్లీ పోలీసు ఆఫీసరే నడవలేకపోతే మామూలు అమ్మాయిల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications