రియల్ ఏజెంట్ల నయా దందా: బ్లాక్ మనీకి బంపర్ ఆఫర్!
60:40 నిష్పత్తి ప్రకారం.. లక్ష రూపాయల పాత నోట్లను 60వేలుగా పరిగణిస్తూ.. వాటిని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులుగా మళ్లించేందుకు పలువురు రియల్ వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు.
నోయిడా : నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం ఢీలా పడిపోయింది. ప్రస్తుతం పట్టాలెక్కించిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి బిల్డర్లు నానా కష్టాలు పడుతున్నారు. చేతిలో సరిపడా డబ్బు లేకపోవడంతో.. ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దీంతో నల్లకుబేరులకు గాలం వేసే ప్రయత్నం చేస్తున్నారు బిల్డర్స్.
60:40 నిష్పత్తి ప్రాతిపదికన.. లక్ష రూపాయల పాత నోట్లను 60వేలుగా పరిగణిస్తూ.. వాటిని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులుగా మళ్లించేందుకు పలువురు రియల్ వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఆఫర్లతో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, అలహాబాద్, ఘజియాబాద్, నోయిడాతో పాటు చుట్టుపక్కల ప్రజలనురియల్ వ్యాపారులు ప్రలోభ పెడుతున్నారు.

30శాతం నుంచి 50శాతం కమిషన్ మేరకు పలువురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, వ్యాపారులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు రియల్ వ్యాపారులు. మరికొంతమంది బడాబాబులు నేరుగా రియల్ వ్యాపారులనే ఆశ్రయించి తమ వద్దనున్న బ్లాక్ మనీని రియల్ రంగంలో పెట్టుబడులుగా పెట్టేందుకు ఆఫర్ ఇస్తున్నారట.
మొత్తం 100 నుంచి 150 బ్యాంకుల ఖాతాదారులతో ఓ చైన్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకుని.. ఆ ఖాతాల ద్వారా బ్లాక్ మనీని వైట్ గా మార్చేందుకు రియల్ ఏజెంట్లు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ దందా బయటపడితే మాత్రం భారీ ఎత్తున మూల్యం చెల్లించుకోక తప్పదనేది చార్టెట్ అకౌంటెంట్ల వాదన.












Click it and Unblock the Notifications