దేశవ్యాప్తంగా భారీ ఐటీ దాడులు..! ఈ లిస్ట్ లో మీరు ఉన్నారా..?
దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను శాఖ ఇవాళ భారీ ఆపరేషన్ చేపట్టింది. వ్యక్తులు, సంస్థలపైనా భారీ ఎత్తున దాడులు నిర్వహిస్తోంది. నకిలీ పత్రాలతో, క్లెయిమ్ లతో ఆదాయపు పన్ను మినహాయింపులు పొంది ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్న వారిని టార్గెట్ చేసుకుని ఈ దాడులు నిర్వహిస్తోంది. దేశంలోని వివిధ నగరాల్లో ఏకకాలంలో ఈ దాడులు జరుగుతున్నాయి.
ఆదాయపు పన్ను వసూలు విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ, గడువులు పెంచుతూ మధ్యతరగతి, వేతన జీవులకు ఊరటనిస్తున్న ఐటీ శాఖ.. ఇప్పుడు ఫేక్ మినహాయింపులు తీసుకుంటున్న వారిపై కొరడా ఝళిపిస్తోంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు విరాళాలు, ట్యూషన్ ఫీజులు, వైద్య ఖర్చుల విషయంలో ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించడం ద్వారా భారీగా ఖజానాకు గండి కొడుతున్నట్లు అధికారులు గుర్తించారు.

దీంతో ఐటీ చెల్లింపుదారులు ఆయా మినహాయింపులు పొందేందుకు వీలుగా వీరికి ఫేక్ పత్రాలు తయారీ, సమర్పణ విషయంలో సహకరిస్తున్న వ్యక్తులు, సంస్థలపై దాడులు చేస్తున్నారు. అలాగే పలువురు అకౌంటెంట్ల కార్యాలయాలపైనా ఈ దాడులు జరుగుతున్నాయి. వాస్తవానికి నకిలీ పత్రాలతో మినహాయింపులు తీసుకున్న పలువురు వ్యక్తులు, సంస్థల రిటర్న్ లపై అనుమానం వచ్చి సవరించిన రిటర్న్ లు దాఖలు చేయాలని ఐటీ శాఖ నోటీసులు పంపినా పట్టించుకోని వారిని టార్గెట్ చేసుకుని ఈ దాడులు నిర్వహిస్తున్నారు.
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రాజకీయ పార్టీలకు విరాళాలు, పిల్లల ట్యూషన్ ఫీజులు, వైద్య ఖర్చుల్ని రిటర్న్ లు వేసేటప్పుడు మినహాయింపులుగా చూపించుకోవచ్చు. అయితే ఇదే అదనుగా ఫేక్ పత్రాలు సృష్టించి భారీగా మినహాయింపులకు క్లెయిమ్ చేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు ఐటీ శాఖ చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా ఫలించట్లేదు. ఈ నేపథ్యంలో దాడులు చేసి కేసులు నమోదుచేస్తున్నారు.












Click it and Unblock the Notifications