పీసీసీ చీఫ్‌తో బీజేపీ మాజీ మంత్రి భేటీ: ఏం జరుగుతోంది..!!
బెంగళూరు: దేశంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈ ఏడాది ఏకంగా ఎనిమిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు జరుగనుంది. తెలంగాణ సహా కీలక రాష్ట్రాలు ఎన్నికలను ఎదుర్కొనబోతోన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి, ప్రతిపక్ష యూపీఏకు ఇది అత్యంత కీలకమైన సంవత్సరం. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావించే ఈ పోరులో పైచేయి సాధించడానికి కసరత్తు షురూ చేశాయి ఆయా పార్టీలన్నీ.

తెలంగాణ సహా..
కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, త్రిపుర, మేఘాలయాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో అయిదు, ద్వితీయార్థంలో మూడు రాష్ట్రాలకు ఎన్నికలు షెడ్యూల్ కానున్నాయి. ఫిబ్రవరి-మార్చి నెలల్లో తొలి అయిదింటికీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇది మినీ సార్వత్రిక ఎన్నికలను తలిపిస్తోన్నాయి.

కర్ణాటకలో కీలకం
..
పొరుగునే ఉన్న కర్ణాటకలో ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లల్లో పోలింగ్ షెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది. మే నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం దాదాపు ఖాయమే. ఎప్పట్లాగే ఈ దఫా కూడా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారథ్యంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) మధ్య ముక్కోణపు పోటీ ఏర్పడుతుందనే అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి కూడా- ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

బీజేపీ మాజీ మంత్రి..
ఈ పరిణామాల మధ్య బీజేపీ ప్రభుత్వ మాజీ మంత్రి హెచ్ నగేష్.. అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సాయంత్రం ఆయన బెంగళూరులో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత డీకే శివకుమార్ ను కలిశారు. దీనితో ఆయన ఇక కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తోన్నాయి.

స్వతంత్ర ఎమ్మెల్యేగా..
2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ముళబాగల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ఘన విజయం సాధించారు. అనంతరం అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి సారథ్యంలోని జనతాదళ్ (సెక్యులర్)- కాంగ్రెస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీకి మద్దతు ప్రకటించారు. బీఎస్ యడియూరప్ప ప్రభుత్వంలో కూడా మంత్రిగా కొనసాగారు. ఎక్స్సైజ్ శాఖను పర్యవేక్షించారు.

మంత్రివర్గం నుంచి ఉద్వాసన..
అనంతరం చోటు చేసుకున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చోటు కోల్పోయారు. అంబేద్కర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా అపాయింట్ చేసింది బీజేపీ ప్రభుత్వం. కేబినెట్ హోదాను కల్పించింది. ఇప్పుడాయన కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ముళబాగల్ నుంచే పోటీ చేయించే అవకాశాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తోంది.












Click it and Unblock the Notifications