వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హాథ్‌రస్ కేసు: ఆమె నాలుక తెగడం, వెన్నెముక విరగడం... అన్నీ అబద్ధాలా? అసలేం జరిగింది? - గ్రౌండ్ రిపోర్ట్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
హాథ్‌రస్‌ అత్యాచారం కేసు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్‌రస్‌ ఇప్పుడు అట్టుడుకుతోంది. స్థానిక దళిత యువతిపై గ్యాంగ్ రేప్‌‌ జరిగిందన్న ఆరోపణలతో నమోదైన కేసు దేశవ్యాప్తంగా చర్చనీయమైంది.

ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మరణించారు. అయితే, ఆమెపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేస్తోందని అంటున్నారు యూపీ పోలీసులు.

''ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులో వీర్యం ఆనవాళ్లు కనిపించలేదు. దీన్ని బట్టి కొందరు కావాలనే, కులాల మధ్య చిచ్చుపెట్టడానికి ఈ విషయాన్ని వివాదాస్పదం చేశారని అర్థమవుతోంది. అలాంటి వాళ్లను గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం'' అని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసు ఏడీజీ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ చెప్పారు.

''సెప్టెంబర్ 28న సఫ్ధర్‌జంగ్ ఆసుపత్రికి 20 ఏళ్ల యువతిని తీసుకువచ్చారు. ఆమె పరిస్థితి అప్పటికే విషమంగా ఉంది. ఆసుప్రతిలో చేర్చుకున్నప్పుడు ఆమె వెన్నెముకకు మెడభాగంలో గాయమైంది. క్వాడ్రిప్లెజియా (ట్రామా కారణంగా పక్షవాతం), సెప్టెకెమియా (ఇన్ఫెక్షన్)తో ఆమె బాధపడుతూ ఉన్నారు’’ అని దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి ప్రకటన పేర్కొంది.

https://twitter.com/ankit_tyagi01/status/1311199479425425408?s=24

బాధితురాలి వెన్నెముక విరిగిందని, ఆమె నాలుక తెగి ఉందని ప్రచారం జరిగింది. పోలీసులు మాత్రం ఇది వాస్తవం కాదని అంటున్నారు.

హంతకులు ఆమె గొంతునులిమారని, ఈ క్రమంలోనే మెడభాగంలో వెన్నెముకకు చివర ఉండే ఎముకలు విరిగాయని వాళ్లు చెబుతున్నారు.

హాథ్‌రస్‌ను మెయిన్ రోడ్డుతో కలిపే రోడ్డుకు దాదాపు వంద మీటర్ల దూరంలో ఓ చేను ఉంది. అందులో సజ్జలు వేశారు. ఈ చేనులోనే యువతిపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక్కడికి జర్నలిస్టులు వస్తూ, పోతూ ఉన్నారు.

''ఈ ఘటన బయటికి చిత్రిస్తున్నంత పెద్దది కాదు. అసలు నిజం వేరే ఉండొచ్చు’’ అని అక్కడున్న స్థానిక జర్నలిస్టులు నాతో అన్నారు.

''అలాంటప్పుడు మీరు వాస్తవాలేంటో, మీ కథనాల్లో ఎందుకు రాయడం లేదు’’ అని వారిని అడిగా.

''ఈ ఘటన విషయమై ఇప్పుడు తీవ్ర భావోద్వేగాలు కనిపిస్తున్నాయి. మేం ఎందుకు రిస్క్ తీసుకోవాలి?’’ అని వారు అన్నారు.

అయితే, ఈ ఘటన చిన్న విషయమని చెప్పేందుకు కూడా వారి దగ్గరమైన బలమైన ఆధారాలు లేవు. ఆ నోటా, ఈ నోటా విన్నదే వాళ్లు కూడా చెబుతున్నారు. గ్రామంలోనూ ఇలాంటి చర్చలే వినిపించాయి.

హాథ్‌రస్‌ అత్యాచారం కేసు బాధితురాలి ఇల్లు

మెడికల్ రిపోర్ట్‌లోనూ బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు లేదని హాథ్‌రస్ ఎస్పీ విక్రాంత్ వీర్ చెప్పారు.

అయితే, ఈ రిపోర్ట్ బాధితురాలి కుటుంబానికి ఇంకా ఇవ్వలేదు. బాధితురాలిని దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చినప్పుడు కూడా వారికి మెడికల్ రిపోర్ట్ ఇవ్వలేదు.

''పోలీసులు మాకు పూర్తి పత్రాలు ఇవ్వలేదు. నా చెల్లెలి మెడికల్ రిపోర్ట్ కూడా మాకు ఇవ్వలేదు’’ అని బాధితురాలి సోదరుడు అన్నారు.

ఈ విషయమై ఎస్పీ విక్రాంత్‌ను వివరణ కోరగా, ''అది రహస్య సమాచారం. దర్యాప్తులో కీలకం. ఘటనకు సంబంధించి సాక్ష్యాధారాలన్నింటినీ సేకరిస్తున్నాం. ఫోరెన్సిక్ ఆధారాలను కూడా సేకరించాం’’ అని ఆయన బదులిచ్చారు.

మీడియా కథనాల్లో వర్ణిస్తున్న స్థాయిలో బాధితురాలిపై అకృత్యాలు జరగలేదని ఎస్‌పీ విక్రాంత్ పదేపదే చెప్పారు.

''ఆమె నాలుక తెగడం, వెన్నెముక విరగడం... ఇవన్నీ అబద్ధాలు. హంతకులు గొంతు నులమడం వల్ల ఆమె మెడ ఎముకలు విరిగాయి. ఫలితంగా ఆమె నాడీ వ్యవస్థ కూడా దెబ్బతింది’’ అని ఆయన చెప్పారు.

ఘటన జరిగిన తర్వాత కొద్ది సమయానికి రికార్డు చేసినట్లుగా చెబుతున్న వీడియోలోనూ బాధితురాలు తనపై అత్యాచారం జరిగినట్లు చెప్పలేదు. ప్రధాన నిందితుడి పేరును ప్రస్తావించిన ఆమె... తనను అతడు చంపడానికి ప్రయత్నించాడని మాత్రం చెప్పారు.

హాథ్‌రస్‌ అత్యాచారం కేసు

కానీ, ఆసుపత్రిలో తీసిన మరో వీడియలో, పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో మాత్రంపై తనపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు బాధితురాలు చెప్పారు. ప్రధాన నిందితుడు ఇదివరకు కూడా తనపై లైంగిక వేధింపులకు ప్రయత్నించాడని ఆమె అన్నారు. ''నాపై ఇద్దరు అత్యాచారం చేశారు. మా అమ్మ అరుపులు విని, మిగతా వాళ్లు పారిపోయారు’’ అని చెప్పారు.

''నేను గడ్డి కోస్తూ ఉన్నా. నా కూతురిని గడ్డి కట్టగా కట్టమని చెప్పాను. ఆమె ఒకే కట్ట కట్టింది. ఆ తర్వాత కనిపించలేదు. తనను వెతుక్కుంటూ వెళ్లా. ఓ గంట సేపు తిరిగా. ఎక్కడా కనిపించలేదు. ఇంటికి వెళ్లిందేమో అనుకున్నా. పొలాల్లో అటూ ఇటూ తిరిగా. ఓ చోట స్పృహ లేకుండా తను కింద పడిపోయి ఉంది. ఆమె గొంతు చుట్టూ చున్నీ బిగించి ఉంది. ఒంటిపై బట్టలు లేవు. ఆమె వెన్నెముక విరిగిపోయింది. నాలుక తెగి ఉంది. పక్షవాతం వచ్చినట్లుగా తను పడిపోయి ఉంది. ప్రాణాలే లేనట్లుగా ఉంది’’ అని ఘటన జరిగిన రోజును గుర్తు చేసుకుంటూ బాధితురాలి తల్లి చెప్పారు.

బాధితురాలు మొదట తన వాంగ్మూలంలో నిందితుల్లో ఒకరి పేరే చెప్పడం గురించి స్పందిస్తూ... ''ఆ చేను నుంచి తీసుకువచ్చేటప్పుడు ఆమె పూర్తిగా స్పృహ కోల్పోలేదు. అప్పుడు ఒకరి పేరే చెప్పింది. ఆ తర్వాత ఓ గంటకు స్పృహ కోల్పోయింది. నాలుగు రోజుల తర్వాత ఆమె మళ్లీ స్పృహలోకి వచ్చింది. అప్పుడు మొత్తం విషయం వివరించింది. మొత్తం నలుగురు అబ్బాయిలు ఉన్నారని చెప్పింది’’ అని బాధితురాలి తల్లి చెప్పారు.

ఘటనాస్థలం నుంచి రెండు కి.మీ.ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది. బాధితురాలిని ఆమె కుటుంబం ఆసుపత్రి కన్నా ముందు అక్కడికే తీసుకువెళ్లింది.

''ఆమె దారి పొడవునా రక్తం కక్కుతూ ఉంది. తన నాలుక నీలి రంగులోకి మారిపోయింది. ఏదైనా చెప్పమని ఆమెను అడిగా. తన గొంతు నులిమారని మాత్రమే ఆమె చెప్పగలిగింది’’ అని బాధితురాలి తల్లి చెప్పారు.

హాథ్‌రస్‌ అత్యాచారం కేసు

సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి ఇచ్చిన శవపరీక్ష నివేదికలో, ''వెన్నెముకకు మెడ భాగంలో అయిన తీవ్ర గాయం, దాని వల్ల తలెత్తిన ఇతర సమస్యల కారణంగా బాధితురాలు మరణించారు. ఆమె గొంతు నులిమినట్లు ఆనవాళ్లు కూడా కనిపించాయి. కానీ, మరణానికి అది కారణం కాదు’’ అని ఉంది.

సెప్టెంబర్ 14న యువతిపై దాడి జరిగింది. అప్పటి నుంచి ఈ కేసు ఎఫ్ఐఆర్‌లో మూడు సార్లు సెక్షన్లు మారాయి.

మొదట పోలీసులు దీన్ని హత్యాయత్నం కేసుగా నమోదు చేశారు. ఆ తర్వాత గ్యాంగ్ రేప్ సెక్షన్లను కూడా జోడించారు. సెప్టెంబర్ 29న దిల్లీ సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో బాధితురాలు మరణించిన తర్వాత హత్యకు సంబంధించిన సెక్షన్లు పెట్టారు.

ఆ తర్వాత ఐదు రోజులకు ఈ కేసులో పోలీసులు తొలి అరెస్టు చేశారు.

కేసులో పోలీసులు ఏమైనా నిర్లక్ష్యంగా వ్యవహరించారా అన్న ప్రశ్నకు, ''సెప్టెంబర్ 14న ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో బాధితురాలు, ఆమె తల్లి, సోదరుడు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ప్రధాన నిందితుడు బాధితురాలిని గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశాడని ఆమె సోదరుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. పదిన్నర కల్లా మేం ఎఫ్ఐఆర్ నమోదు చేశాం’’ అని ఎస్పీ విక్రాంత్ చెప్పారు.

''బాధితురాలిని వెంటనే జిల్లా ఆసుపత్రికి పంపించాం. అక్కడి నుంచి అలీగఢ్ మెడికల్ కాలేజ్‌కు తీసుకువెళ్లారు. చికిత్స వెంటనే మొదలైంది. బాధితురాలు మాట్లాడే పరిస్థితికి రాగానే, విచారణ అధికారి ఆమె వాంగ్మూలం తీసుకున్నారు. బాధితురాలు మరో వ్యక్తి పేరు చెప్పారు. తాను లైంగిక వేధింపులకు గురయ్యానని అన్నారు. ఈ వాంగ్మూంలం ఆడియో, వీడియో మా దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత మరో నిందితుడి పేరును కూడా కేసులో చేర్చాం’’ అని ఆయన వివరించారు.

''22న నలుగురు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు చెప్పారు. 'ఇదివరకు ఇద్దరే లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు చెప్పారు కదా’ అని ప్రశ్నిస్తే, తాను అప్పుడు పూర్తి స్పృహలో లేనని ఆమె చెప్పారు. ఆ తర్వాత గ్యాంగ్ రేప్ సెక్షన్లను నమోదు చేశాం. నిందితులను అరెస్టు చేసేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశాం. మిగతా ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, జైలుకు పంపాం. అయితే బాధితురాలి గాయాలను పరిశీలించిన వైద్యులు, అత్యాచారం జరిగినట్లు ఆనవాళ్లు లేవని చెప్పారు. ఫోరెన్సిక్ నివేదిక కోసం వేచి చూస్తున్నాం’’ అని విక్రాంత్ వివరించారు.

హాథ్‌రస్‌ అత్యాచారం కేసు

రాత్రి పూట అంత్యక్రియలు

మంగళవారం రాత్రి బాధితురాలికి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. తమను ఇంట్లో బంధించి, బలవంతంగా ఈ అంత్యక్రియలు జరిపారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

అయితే, బాధితురాలి బంధువుల సమక్షంలోనే అంత్యక్రియలు జరిగాయని పోలీసులు చెప్పారు.

రాత్రి పూట బలవంతంగా అంత్యక్రియలు చేయించడంపై బాధితురాలి బంధువులు, దళిత వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది.

పోలీసులు సాక్ష్యాలను నాశనం చేయాలనే ఈ పని చేశారని, మరోసారి 'పోస్టుమార్టం’ నిర్వహించే అవకాశాలు లేకుండా చేశారని ఆరోపణలు వినిపించాయి.

''మా బంధువులను కొట్టారు. బలవంతంగా అంత్యక్రియలు నిర్వహించారు. అసలు ఎవరికి అంత్యక్రియలు చేశారో కూడా మాకు తెలియదు. ఆఖరిసారి మా సోదరి ముఖం కూడా చూసుకోనివ్వలేదు. పోలీసులకు అంత తొందర దేనికి?’’ అని బాధితురాలి సోదరుడు అన్నారు.

ఇదే విషయం గురించి ఎస్పీ విక్రాంత్‌ను ప్రశ్నించినప్పుడు, ''అప్పటికే బాధితురాలు మరణించి చాలా సమయం గడిచింది. పోస్టుమార్టం, పంచనామా పూర్తయ్యేసరికి 12 గంటలైంది. కొన్ని కారణాలతో శవాన్ని వెంటనే తీసుకురాలేకపోయాం. బాధితురాలి తండ్రి, సోదరుడు శవంతోపాటు వచ్చారు. వారి బంధువులు రాత్రే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దహనం కోసం కట్టెలు, ఇతర వస్తువులు సేకరించడంలో పోలీసులు సాయపడ్డారు. బాధితురాలి బంధువులే అంతిమ సంస్కారాలు చేశారు’’ అని ఆయన బదులు ఇచ్చారు.

హాథ్‌రస్‌ అత్యాచారం కేసు

నిందితుల కుటుంబాలు ఏమంటున్నాయంటే...

ఈ కేసులో ముగ్గురు నిందితుల కుటుంబాలు ఒకే పెద్ద ఉమ్మడి ఇంట్లో ఉంటున్నాయి. బాధితురాలి ఇంటికి ఇది దగ్గర్లోనే ఉంది.

నేను అక్కడికి వెళ్లేసరికి, ఆ ఇంట్లో మహిళలు మాత్రమే ఉన్నారు. తమ వాళ్లను తప్పుడు కేసులో ఇరికించారని వారు అన్నారు.

నిందితుల్లో ఒకరి వయసు 32 ఏళ్లు. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరో నిందితుడికి 28 ఏళ్లు. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడో నిందితుడికి సుమారు 20 ఏళ్లు. ఆయనకు ఇంకా పెళ్లి కాలేదు.

''చాలా పాత శత్రుత్వం ఇది. వాళ్లు చేసే పనే ఇది. తప్పుడు ఆరోపణలు చేస్తారు. ఆ తర్వాత డబ్బులు గుంజుతారు. ప్రభుత్వం నుంచి, ఇతరుల నుంచి కూడా పరిహారం తీసుకుంటారు’’ అని నిందితుల కుటుంబాలకు చెందిన మహిళలు అన్నారు.

తమ వాళ్లను పోలీసులు అరెస్టు చేయలేదని, పిలిపించారని వారిలో ఒకామె చెప్పారు. ''కేసులో పేరు రాగానే మేమే వారిని పోలీసులకు అప్పగించాం’’ అని అన్నారు.

''మా కొడుకు పాల డెయిరీలో పనిచేస్తాడు. ఘటన జరిగినప్పుడు తను అక్కడే ఉన్నాడు. కావాలంటే అక్కడి హాజరు రిజిస్టర్ కూడా తనిఖీ చేసుకోవచ్చు’’ అని ఓ నిందితుడి తల్లి అన్నారు.

తాము ఠాకుర్లమని, బాధితురాలి కుటుంబానిది దళిత వర్గమని నిందితుల కుటుంబ సభ్యులు పదేపదే ప్రస్తావించారు.

''మేం ఠాకుర్లం. వాళ్లు దళితులు. వాళ్లు దారిలో కనిపించినా మేం దూరం జరుగుతాం. వాళ్లను ఎందుకు ముట్టుకుంటాం? వాళ్ల దగ్గరికి ఎందుకు వెళ్తాం?’’ అని ఒకామె అన్నారు.

ఇక ఊర్లో నిందితుల గురించి రకరకాల అభిప్రాయాలు వినిపించాయి. నిందితుల్లో ఒక వ్యక్తి ఇదివరకు కూడా అమ్మాయిలను వేధిస్తుండేవాడని కొన్ని ఠాకుర్ కుటుంబాల మహిళలే అన్నారు.

''ఆ కుటుంబం అలాంటిదే. ఎప్పుడూ గొడవలు పెట్టుకుంటుంటారు. వారిది చాలా పెద్ద కుటుంబం. వాళ్లంతా కలిసే ఉంటారు. ఊరిలో వాళ్ల పెత్తనమే నడుస్తుంది. వారికి ఎవరూ ఎదురు మాట్లాడరు’ అని ఠాకుర్ కుటుంబాలకు చెందిన యువకులు కొందరు అన్నారు.

''మీరు అనుకుంటున్నట్లుగా ఈ ఘటనలో ఏం జరగలేదు. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తుంది కదా. ఒక వారంలో మీకు అన్ని వివరాలూ తెలుస్తాయి. చూస్తూ ఉండండి’’ అని పొలంలో పనిచేసుకుంటున్న మరో యువకుడు అన్నారు.

హాథ్‌రస్‌ అత్యాచారం కేసు

'గ్రామంలో కుల వివక్ష’

ఈ ఊరిలో చాలా వరకూ ఠాకుర్, బ్రాహ్మణ కుటుంబాలే ఉన్నాయి.

దళితుల ఇళ్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇవన్నీ దగ్గరదగ్గరే ఉన్నాయి.

ఊరిలోని దళితులకు, మిగతావారికి మధ్య ప్రత్యక్ష సంబంధాలు పెద్దగా కనిపించలేదు.

ఈ ఘటన తర్వాత అగ్రవర్ణాలుగా పిలిచే వర్గాలకు చెందినవారు ఎవరూ బాధితురాలి ఇంటికి వచ్చి, ఓదార్చే ప్రయత్నాలు చేయలేదు.

''మాపై ఇలాంటి దాడి జరగడం ఇది మొదటిసారి కాదు. మా బిడ్డలు, కోడళ్లు ఒంటరిగా పొలానికి వెళ్లాలంటే భయపడతారు. తండ్రి, సోదరుడితో కలిసి వెళ్లినా, ఆ అమ్మాయికి అలా జరిగింది. వీళ్లు మా జీవితాలను నరకంగా మార్చేశారు. ఇందులో ఎలా ఉండాలో మాకు పాలుపోవడం లేదు’’ అని ఓ దళిత వ్యక్తి అన్నారు.

గ్రామానికి వచ్చే అన్ని దారుల్లో పోలీసులు బారికేడ్లు పెట్టారు. చాలా మందిని బయటే ఆపుతున్నారు. జర్నలిస్టులు గ్రామంలోకి నడిచే వెళ్లాల్సి వస్తోంది.

బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు దళిత సంఘాలకు చెందిన వాళ్లు వస్తున్నా, వారిని పోలీసులు గ్రామం బయటే ఆపేస్తున్నారు.

హాథ్‌రస్‌ అత్యాచారం కేసు

సిట్ బృందం విచారణ మొదలు

ఈ కేసుపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది.

బుధవారం సాయంత్రం ఆ బృందం హాథ్‌రస్ చేరుకుంది.

ఇప్పుడు మీడియాతోపాటు ఎవరినీ గ్రామంలోకి పోలీసులు రానివ్వడం లేదు.

సిట్ దర్యాప్తు మొదలుపెట్టింది. వారం తర్వాత ఈ బృందం దీనిపై రిపోర్ట్ ఇవ్వనుంది.

సిట్ విచారణ తర్వాత ఘటనకు సంబంధించి నిజానిజాలు వెలుగుచూసే అవకాశాలున్నాయి.

మరోవైపు ఈ ఘటన విషయంలో పోలీసుల వ్యవహరించిన తీరుపై కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవి...

1. ఘటనాస్థలాన్ని పోలీసులు ఎందుకు సీల్ చేయలేదు? ఆరంభంలోనే అక్కడ సాక్ష్యాలు ఎందుకు సేకరించలేదు?

2. రాత్రిపూట బలవంతంగా అంత్యక్రియలు ఎందుకు చేశారు?

3. బాధితురాలి కుటుంబానికి మెడికల్ రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు?

4. సాంకేతిక ఆధారాలు ఎందుకు సేకరించలేదు? నిందితుల అరెస్టులో ఆలస్యం ఎందుకు చేశారు?

ఈ ప్రశ్నలకు స్పందిస్తూ పోలీసులు ఎలాంటి అలసత్వమూ చూపలేదని ఎస్పీ విక్రాంత్ అన్నారు.

''పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. సేకరిస్తూనే ఉన్నారు. ఘటనపై విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుంది. దోషులు ఎవరూ తప్పించుకోలేరు. నిర్దోషులను తప్పుగా ఇరికించం. వీలైనంత వేగంగానే మా విచారణ సాగుతోంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఈ కేసులో త్వరగా న్యాయం జరిగేలా చూస్తాం’’ అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Reality and truth behind Hathras incident
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X