వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్: విద్యార్థుల భవిష్యత్తు కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నాం - ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

పది, ఇంటర్‌ పరీక్షలు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఈనాడు దిన పత్రిక కథనం ప్రచురించింది.

''విద్యార్థుల భవిష్యత్తు కోసమే పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.

పరీక్షలు రద్దుచేయడం చాలా సులభమని, అన్ని జాగ్రత్తలతో నిర్వహించడమే కష్టమని చెప్పారు. విద్యార్థుల కోసం కష్టతరమైన మార్గాన్నే ఎంచుకున్నామన్నార’’ని 'ఈనాడు’ రాసింది.

''రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు గురించి తనకన్నా ఎక్కువ ఆలోచించేవారు ఎవరూ ఉండరన్నారు. వారి కోసం పలు పథకాలు అమలుచేస్తున్నట్లు సీఎం వెల్లడించారు.

ఇలాంటి విపత్కర సమయంలోనూ కొందరు రాజకీయ ప్రయోజనం కోసం అగ్గి పెట్టాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశార’’ని ఈనాడు వివరించింది.

కోవిడ్ కొని తెచ్చుకోకండి- తెలంగాణ

లక్షణాలుంటేనే టెస్టులు, కోవిడ్ కొనితెచ్చుకోవద్దన్న తెలంగాణ

లక్షణాలు ఉంటేనే పరీక్షల కోసం వెళ్లాలని, లేదంటే అనవసరంగా కోవిడ్ బారిన పడతారని తెలంగాణ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించినట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక కథనం ప్రచురించింది.

కొవిడ్‌ లక్షణాలు.. అంటే జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, విరోచనం, కళ్లు ఎర్రబడటం, ఒళ్లునొప్పులు, వాసన, రుచి కోల్పోవడం వంటివి ఉంటేనే టెస్టు చేయించుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్‌) గడల శ్రీనివాసరావు సూచించారు.

అది కూడా.. లక్షణాలు బయటపడ్డాక, మూడు నాలుగు రోజులు మందులు వాడినా తగ్గకుంటేనే టెస్టులకు రావాలని ప్రజలను ఆయన కోరారు

బుధవారం ఆయన డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. అనవసరమైన భయాందోళనలతో ప్రజలంతా టెస్టుల కోసం పరుగులు తీస్తున్నారని.. దీనివల్ల, నిజంగా అవసరమైన వారికి టెస్టులు చేయించుకోవడం ఇబ్బందిగా మారిందని చెప్పారని ఆంధ్రజ్యోతి చెప్పింది.

''కొంతమంది అయితే వారానికి రెండుసార్లు పరీక్షల కోసం వస్తున్నారు. ఇలా లక్షణాలు లేకపోయినా అనవసరంగా టెస్టుల కోసం వచ్చేవారు కొవిడ్‌ను కోరి తెచ్చుకుంటున్నారు'' అని గడల ఆందోళన వెలిబుచ్చారు.

రాష్ట్రంలో సర్కారు చేపట్టిన కట్టడి చర్యలు, ప్రజల జాగ్రత్తలతో పాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుండటంతో కొవిడ్‌ ఉధృతి తగ్గుముఖం పట్టిందని ఆయన తెలిపారు.

కరోనా కేసుల సంఖ్య పెరుగుదలలో దేశవ్యాప్తంగా స్థిరత్వం వచ్చిందని, అటువంటి పరిస్థితే తెలంగాణలోనూ ఉందన్నారు. అయితే.. పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని, అందుకు మూడు నుంచి నాలుగు వారాలు పడుతుందన్నారు.

కాబట్టి, అందరూ అప్రమత్తంగా ఉండాలని, మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. వచ్చే 3-4 వారాలూ అత్యంత కీలకమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించాలని ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యశాఖ ఎటువంటి ప్రతిపాదనలూ ఇవ్వలేదని స్పష్టం చేశారని పత్రిక వివరించింది.

పీఎం కేర్స్ నిధులతో కాన్సన్‌ట్రేటర్లు , ఆక్సిజన్ ప్లాంట్లు-ప్రధాని

పీఎం కేర్స్ ఫండ్ నిధులతో లక్ష కాన్సన్‌ట్రేటర్ల కొనుగోలు, ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారని సాక్షి దినపత్రిక వార్తా కథనం రాసింది.

దేశంలో కరోనా కట్టడిలో పూర్తిగా నిమగ్నమైన కేంద్ర ప్రభుత్వానికి పీఎం కేర్స్‌ ఫండ్‌ సాయపడనుంది.

పీఎం కేర్స్‌ ఫండ్‌ నిధులను వినియోగించుకుని లక్షల పోర్టబుల్‌ ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను సమీకరించడంతోపాటు 500కుపైగా ప్రెషర్‌ స్వింగ్‌ అడ్సార్ప్‌షన్‌ ఆక్సిజన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లను నెలకొల్పుతామని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వెల్లడించారు.

ఇలా అదనపు ఆక్సిజన్‌ అందుబాటులోకి రావడంతో జిల్లా కేంద్రాలు, టైర్‌-2 నగరాల్లో కోవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ అవసరాలు కొంతమేర తీరతాయని ప్రధాని మోదీ చెప్పారు.

డిమాండ్‌ ఎక్కువగా ఉన్న క్లస్టర్ల వద్ద ఆక్సిజన్‌ సరఫరాను మెరుగైన స్థాయిలో పెంచడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయని ప్రధాని కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొందని సాక్షి చెప్పింది.

'డిమాండ్‌ ఉన్న క్లస్టర్ల వద్దే ప్లాంట్లను ఏర్పాటుచేయడం ద్వారా.. ప్రస్తుత ప్లాంట్ల నుంచి ఆస్పత్రులకు ఆక్సిజన్‌ సరఫరా సమస్యలను అధిగమించవచ్చు'.

కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని డీఆర్‌డీఓ, సీఎస్‌ఐఆర్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

వీలైనంత తొందరగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను కొనుగోలుచేసి విపరీతమైన పాజిటివ కేసులతో సతమతమవుతున్న రాష్ట్రాలకు పంపించాలని మోదీ ఆదేశించారని పత్రిక రాసింది.

కోవిడ్‌ సంబంధ కేంద్ర ప్రభుత్వ సహాయక చర్యల్లో నిరంతరాయంగా సాయపడేందుకు భారత వాయుసేన సిద్దంగా ఉందని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా చెప్పారు.

భారీ స్థాయిలో యుద్ధ సరకులను తరలించే వాయుసేన రవాణా విమానాలను కేంద్రప్రభుత్వానికి అందుబాటులో ఉంచుతామని ఆయన ప్రధానికి స్పష్టంచేశారని సాక్షి రాసింది.

అల్లు అర్జున్‌కు కరోనా

హీరో అల్లు అర్జున్‌కు కరోనా సోకిందని నమస్తే తెలంగాణ వార్త ప్రచురించింది.

తెలుగు చిత్రసీమలో కరోనా మహమ్మారి కలవరాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే పలువురు నాయకానాయికలతో పాటు సాంకేతిక నిపుణులు కూడా కోవిడ్‌ బారిన పడ్డారు.

తాజాగా అగ్ర హీరో అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు.

తాను క్షేమంగానే ఉన్నట్లు చెప్పారు. తన ఆరోగ్యం విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

'నాకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఇంట్లోనే స్వీయ నిర్భంధంలో ఉన్నా. అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా. ఇటీవల నన్ను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. అందరూ ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. అవకాశం ఉన్నవారందరూ వ్యాక్సిన్‌ వేయించుకొండి' అని అల్లు అర్జున్‌ ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు.

కొన్నాళ్లుగా బన్నీ 'పుష్ప' షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన కరోనా బారిన పడటంతో షూటింగ్‌ను చిత్రబృందం నిలిపివేసినట్లు తెలిసిందని నమస్తే తెలంగాణ చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Jagan: We are conducting examinations for the future of the students
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X