సైన్యానికి 79 వేల కోట్ల ఆఫర్..! పొరుగు ముప్పు వేళ కేంద్రం సంచలనం..!
ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత సైన్యం అసమాన పోరాటం కనబరిచింది. అయినా అక్కడక్కడా లోపాలు కూడా బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో దశల వారీగా సైనిక అవసరాలను తీరుస్తున్న కేంద్రం.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు హార్డ్ వేర్ అప్ గ్రేడ్ చేసేందుకు వీలుగా రూ.79 వేల కోట్లతో పరికరాల కొనుగోళ్లకు పచ్చజెండా ఊపింది.
రక్షణమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని రక్షణ సామాగ్రి కొనుగోళ్ల సంస్థ ఈ మేరకు 79 వేల కోట్ల ఖర్చుతో మిలిటరీ హార్డ్ వేర్ కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఆర్మీకి ఎంకే-2 నమిస్ ట్రాక్ లపై నాగ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలు, గ్రౌండ్ బేస్ట్ మొబైల్ వ్యవస్థలు, వాటిపై క్రేన్ లు అమర్చిన మొబిలిటీ వాహనాలు ఉన్నాయి. వీటితో శత్రువుల వాహనాలు, బంకర్లు ఇతర ఫీల్డ్ ఫోర్టిఫికేషన్‌లను నాశనం చేసేందుకు వీలు కలుగుతుంది.

అలాగే నేవీ కోసం ల్యాండింగ్ ప్లాట్‌ఫారమ్ డాక్‌లు, 30ఎంఎం నావల్ సర్ఫేస్ గన్, అధునాతన తేలికపాటి టార్పెడోలు, ఎలక్ట్రో-ఆప్టికల్ ఇన్‌ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ సిస్టమ్, 76ఎంఎం సూపర్ రాపిడ్ గన్ మౌంట్ కోసం స్మార్ట్ మందుగుండు సామగ్రి ఉన్నాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ తో కలిసి ఉమ్మడి దాడుల నిర్వహణలో నేవీకి ల్యాండింగ్ ప్లాట్‌ఫారమ్ డాక్‌లు ఉపయోగపడతాయి. వీటిని శాంతి పరిరక్షక కార్యకలాపాలు, మానవతా సాయం, విపత్తు సాయానికి కూడా వాడుకోవచ్చు.

అలాగే 30 ఎంఎం నావల్ సర్ఫేస్ గన్లు తక్కువ తీవ్రత కలిగిన సముద్ర , పైరసీ నిరోధక కార్యకలాపాలను నిర్వహించడానికి నేవీ, భారత కోస్ట్ గార్డ్ సామర్థ్యాన్ని పెంచుతాయని కేంద్రం తెలిపింది. వీటితో పాటు ఎయిర్ ఫోర్స్ కోసం సహకార లాంగ్ రేంజ్ టార్గెట్ సాచురేషన్/డిస్ట్రక్షన్ సిస్టమ్ , ఇతర కొనుగోళ్లను ఆమోదించింది. ఈ వ్యవస్థ మిషన్ ప్రాంతంలో స్వయంప్రతిపత్తిగా టేకాఫ్, ల్యాండ్, నావిగేట్, గుర్తించడం, పేలోడ్‌ను పంపిణీ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు రక్షణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.












Click it and Unblock the Notifications