జయకు సీరియస్: ఆసుపత్రి వద్ద రోదనలు, గవర్నర్ ప్రకటన కోసం భారత్ వెయిటింగ్
తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు ప్రకటన కోసం భారత దేశం వేచి చూస్తోంది.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు గుండెపోటు రావడంతో అభిమానులు కలత చెందుతున్నారు. అపోలో అసుపత్రి వద్ద ఉద్వేగ వాతావరణం కనిపిస్తోంది. అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్ద గుమికూడారు.
జయలలితకు ఏమయిందో తెలియక కన్నీరుమున్నీరు అవుతున్నారు. అమ్మ ఆరోగ్యంగా తిరిగి వస్తుందని వారు కోరుకుంటున్నారు. ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున వచ్చిన మహిళా అభిమానులు కంటతడి పెడుతున్నారు. ఆసుపత్రి వద్ద అభిమానుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పారామిలిటరీ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళనాడు వ్యాప్తంగా ఆర్మ్‌డ్, రిజర్వ్ పోలీసులను ఉంచారు.

జయలలిత చికిత్స పొందుతున్న ఆపోలో ఆసుపత్రి పూర్తిగా భద్రతా వలయంలో ఉంది. ఆమె ఆరోగ్యం విషమించిన దృష్ట్యా భద్రతను పెంచారు. ఆసుపత్రి వైపు దూసుకెళ్లేందుకు కొందరు కార్యకర్తలు యత్నించగా పోలీసులు నిలువరించారు. ఆసుపత్రి వద్ద దుకాణ సముదాయాలను మూసివేశారు.
గవర్నర్ ప్రకటన కోసం భారత్ నిరీక్షణ
తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు ప్రకటన కోసం భారత దేశం వేచి చూస్తోంది. జయకు గుండెపోటు వచ్చిన విషయం తెలియగానే ఆయన ముంబై నుంచి హుటాహుటిన చెన్నై వచ్చారు. అపోలో ఆసుపత్రిలో పది నిమిషాలు ఉన్నారు. ఆ తర్వాత ఆయన అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డితో కలిసి రాజ్ భవన్ వెళ్లారు. రాజ్ భవన్ ప్రకటన కోసం అందరూ వేచి చూస్తున్నారు.
కాగా, జయలలిత ఆరోగ్యం విషమించడంతో తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ముందు జాగ్రత్త చర్యగా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న అన్ని వాహనాలను చెన్నై నగర శివార్లలోనే నిలిపివేస్తున్నారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications