LPG Gas Cylinder: 24 గంటల్లో 53.5 లక్షల గ్యాస్ సిలిండర్లు డెలివరీ..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నాయి. భారత్ లోనూ గ్యాస్ కొరత విపరీతంగా ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. 24 గంటల్లో 53.5 లక్షల గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసినట్లు పేర్కొంది. రికార్డు స్థాయిలో బుకింగ్స్ అదే విధంగా డెలివరీ జరిగిందని స్పష్టం చేసింది. ఈ మేరకు గ్యాస్ కొరత అని వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని.. దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరా సజావుగా సాగుతోందని వివరించింది. ఎక్కడా కూడా స్టాక్ పూర్తయినట్లు నివేదికలు లేవని స్పష్టం చేసింది.
పశ్చిమాసియాలో గత 60 రోజులుగా ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. యుద్ధం కారణంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేసిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ కొరతను ఎదుర్కొన్నాయి. అయితే భారత్ లోనూ గ్యాస్ కొరత కారణంగా పలు హోటల్స్, రెస్టారెంట్స్ ను మూసివేసిన సంఘటనలు మనకు కనిపించాయి. అలాగే చాలామంది ప్రజలు గ్యాస్ కోసం గంటల తరబడి పడిగాపులు కాసిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది.
దేశంలో గ్యాస్ సరఫరాలో కొరత లేదని స్పష్టం చేసింది. గడచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 53.5 లక్షల గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఈ అరుదైన ఘనతను సాధించినట్లు పేర్కొంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొనుగోలులో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రజలకు సరఫరా కొనసాగేలా నిరంతరం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. దేశంలో గ్యాస్ కొరత ఉందన్న వార్తల్లో నిజం లేదని తేల్చింది.

అలాగే దేశవ్యాప్తంగా దాదాపు 98 శాతం ఎల్పీజీ బుకింగ్స్ ఆన్ లైన్ ద్వారానే జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సిలిండర్ల బ్లాక్ మార్కెట్ కు వెళ్లకుండా 93 శాతం డెలివరీలను డెలివరీ అథెంటికేషన్ కోడ్ ద్వారా వెరిఫై చేస్తున్నట్లు పేర్కొంది. ఇక హాస్పిటల్స్, పాఠశాలల్లో కమర్షియల్ గ్యాస్ సరఫరాలో ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే వలస కార్మికుల కోసం 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ల కోటాను డబుల్ చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కు సంబంధించి తగినంత నిల్వలు ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.












Click it and Unblock the Notifications