గన్ పెట్టి డీల్ అంటే..! అమెరికాకు తేల్చేసిన మోడీ మంత్రి...!
రష్యా చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్దానికి ఆజ్యం పోస్తున్నామనే కారణంతో భారత్ పై 50 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాటి నుంచి వెనక్కి తగ్గేందుకు బెట్టు చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగినా రష్యా చమురు కొనుగోళ్లు ఆపాల్సిందేనని తేల్చిచెప్పేస్తున్నారు. తాజాగా మరోసారి ఇదే కండిషన్ తో సుంకాల్ని 15-16 శాతానికి తగ్గిస్తానని ఆఫర్ చేశారు. దీనిపై భారత్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ జర్మనీ టూర్ లో దీనిపై స్పందించారు.
కేవలం దీర్ఘకాలిక ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే భారత్ వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటుందని, బయటి దేశాల నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లతో తొందరపాటుగా మాత్రం కాదని పీయూష్ గోయల్ తెలిపారు. ఈయూతో ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతున్నామని, అదే సమయంలో అమెరికాతోనూ మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. అయితే ఇందులో తొందరేమీ లేదన్నారు. ఒప్పందాల్ని డెడ్ లైన్లతోనో, తలకు గన్ గురిపెట్టి చేసుకోబోమని ఆయన తేల్చిచెప్పేశారు.

విదేశాలతో వాణిజ్య ఒప్పందాలను వేగంగా ఒప్పందం చేసుకోవాలనే ఆతృతలో జాతీయ ప్రాధాన్యాలపై రాజీ పడబోమని పీయూష్ గోయల్ వెల్లడించారు. స్వల్పకాలిక ప్రయోజనాల కంటే దీర్ఘకాలిక అవసరాల్ని దృష్టిలో ఉంచుకునే తాము ఒప్పందాలు చేసుకుంటామని క్లారిటీ ఇచ్చేశారు. జాతీయ ప్రయోజనాల ఆధారంగా కాకుండా మరే ఇతర అంశాల ఆధారంగా భారత్ తన స్నేహితులు ఎవరు అని ఎప్పుడూ నిర్ణయించలేదని తాను భావిస్తున్నట్లు పీయూషే గోయల్ వెల్లడించారు.

పీయూష్ గోయల్ తాజా వ్యాఖ్యలు రష్యా చమురు కొనుగోళ్లు ఆపితే సుంకాలు తగ్గిస్తామంటూ అమెరికా ఇస్తున్న ఆఫర్లకు కౌంటర్ గానే అని తెలుస్తోంది. రష్యా చమురు కొనుగోళ్లను ఇప్పటికే జాతీయ ప్రయోజనాల కోసమేనంటూ చెప్తూ వస్తున్న కేంద్రం.. ఇప్పుడు అమెరికా సుంకాల తగ్గింపు కోసం ఆపేస్తే స్వదేశంలో రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నట్లు అర్దమవుతోంది. అందుకే జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీపడబోమనే సంకేతాల్ని మోడీ కేబినెట్ మంత్రి ఇచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications