భారత్ చేతికి జర్మన్ సబ్‌మెరైన్ టెక్నాలజీ!
హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కదలికలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా భారత్ తన నౌకాదళ శక్తిని అజేయంగా మార్చుకోబోతోంది. జర్మనీతో దశాబ్దాల నాటి రక్షణ బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్తూ.. సుమారు 8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 66 వేల కోట్లు) విలువైన భారీ జలాంతర్గామి ఒప్పందానికి రంగం సిద్ధమైంది భారత్. రాబోయే మూడు నెలల్లోనే ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు జరగనున్నట్లు జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ బుధవారం అధికారికంగా ప్రకటించారు.
ఈ ఒప్పందం ప్రకారం, ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతికత కలిగిన ఆరు జలాంతర్గాములను భారతదేశంలోనే నిర్మిస్తారు. జర్మనీకి చెందిన 'థైస్సెన్‌క్రుప్ మెరైన్ సిస్టమ్స్' (TKMS), భారత ప్రభుత్వ రంగ సంస్థ 'మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్' కలిసి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టనున్నాయి. కేవలం జలాంతర్గాములను కొనుగోలు చేయడం మాత్రమే కాకుండా, అత్యాధునిక జర్మన్ టెక్నాలజీని భారత్‌కు బదిలీ చేయడం (Technology Transfer) ఈ డీల్‌లో హైలైట్. యూరప్ బయట ఒక దేశానికి జర్మనీ ఇలాంటి టెక్నాలజీ ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

రాజ్‌నాథ్ సింగ్ పర్యటనలో కీలక మలుపు..
భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జర్మనీ పర్యటనలో భాగంగా కీల్ నగరంలోని షిప్‌యార్డ్‌ను సందర్శించారు. అక్కడ 'టైప్ 212' క్లాస్ జలాంతర్గాములను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, ఈ ఒప్పందాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే సంకేతాలిచ్చారు. "రెండు దేశాల చర్చలు సరైన మార్గంలో ఉన్నాయి. మరో 90 రోజుల్లో పనులన్నీ పూర్తయి అధికారిక సంతకాలు జరుగుతాయని రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు" అని పిస్టోరియస్ వెల్లడించారు.
యుద్ధ తంత్రం నుంచి శాంతి స్థాపన వరకు.
జలాంతర్గాములతో పాటు, భారత్-జర్మనీ మధ్య 'డిఫెన్స్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్ రోడ్‌మ్యాప్'పై కూడా కీలక ఒప్పందాలు జరిగాయి. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ శిక్షణలో కూడా ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోనున్నాయి. అటు రక్షణ పరికరాల తయారీ, ఇటు ఉమ్మడి సైనిక శిక్షణ.. ఇలా అన్ని రంగాల్లోనూ జర్మనీ మనకు అత్యంత సన్నిహిత భాగస్వామిగా మారుతోంది.
ప్రధాని మోదీ, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ వేసిన పునాదులతో, ఈ సబ్‌మెరైన్ డీల్ భారత్ రక్షణ రంగానికి కొత్త ఊపిరి పోయనుంది. ఆరు అత్యాధునిక జలాంతర్గాములు భారత నౌకాదళంలో చేరితే, హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ ఒక తిరుగులేని శక్తిగా అవతరించడం ఖాయం.












Click it and Unblock the Notifications