ట్రంప్ ముఖం పగిలేలా బదులిచ్చిన కేంద్రం
రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, అదనపు సుంకాలు విధించే బెదిరింపులకు భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. డొనాల్డ్ ట్రంప్ కు ఘాటుగా బదులు ఇచ్చింది.
ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్.. దీన్ని విడుదల చేశారు. తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీన్ని పోస్ట్ చేశారు. ఈ రిప్లై ద్వారా భారత్.. అమెరికాకు తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు తమపై ఆంక్షలు విధించడం, మాటల దాడికి దిగడం సరికాదని పేర్కొంది. అన్యాయంగా తమను టార్గెట్ గా చేసుకుంటున్నారని తెలిపింది.

అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు కూడా రష్యాతో భారీగా వ్యాపారాలను కొనసాగిస్తోన్నాయని, తాము మాత్రమే కాదని గుర్తు చేసింది. సుదీర్ఘకాలంగా రష్యాతో వ్యాపార సంబంధాలను కొనసాగిస్తోన్నామనే విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పటికీ భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోందని, దానిని భారీ లాభాలకు అమ్ముకుంటోందని ఆరోపించిన విషయం తెలిసిందే. ఇకపై భారత్.. రష్యా నుంచి క్రూడాయిల్ ను కొనుగోలు చేయబోదనీ తేల్చి చెప్పారాయన.
రష్యాతో ఆయిల్ ట్రేడింగ్ డీల్ ను కొనసాగిస్తోన్నందన దీనికి ప్రతిగా భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25 శాతం టారిఫ్ ను విధించినట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. భవిష్యత్ లో దీన్ని మరింత పెంచుతామనీ ప్రకటించారు. ఈ అంశాన్ని కూడా కేంద్రం తన రిప్లైలో పొందుపరిచింది.
అలాగే- కొన్ని కీలక అంశాలను లేవనెత్తింది. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత సంప్రదాయబద్ధంగా వస్తోన్న క్రూడాయిల్ సరఫరాలను యూరప్ దేశాలకు మళ్లించారని, గ్లోబల్ మార్కెట్ స్థిరత్వం కోసం భారత్.. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవాలని అప్పట్లో అమెరికా ప్రోత్సహించిందని భారత్ గుర్తు చేసింది.
తమను విమర్శిస్తున్న దేశాలే రష్యాతో భారీగా వ్యాపారం చేస్తున్నాయని విదేశాంగ శాఖ వేలెత్తి చూపించింది. యూరోపియన్ యూనియన్ 2024లో రష్యాతో 67.5 బిలియన్ డాలర్ల విలువైన వస్తువుల కొనుగోలు చేసిందని స్పష్టం చేసింది. సర్వీస్ సెక్టార్ లో మరో 17.2 బిలియన్ డాలర్ల వ్యాపారం చేసిందని వివరించింది. ఇది భారత్-రష్యా వాణిజ్యం కంటే చాలా ఎక్కువ అని తెలిపింది.
అమెరికా-రష్యా వాణిజ్యం: అమెరికా కూడా తన అణు పరిశ్రమ కోసం యురేనియం హెక్సాఫ్లోరైడ్, ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ కోసం పల్లాడియం, ఎరువులు వంటి వాటిని రష్యా నుంచి ఇప్పటికీ దిగుమతి చేసుకుంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన ద్వారా తేల్చి చెప్పింది.
ఈ నేపథ్యంలో, భారత్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమని, అసంబద్ధమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఏ పెద్ద ఆర్థిక వ్యవస్థ మాదిరిగానే, భారత్ కూడా తన జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని గట్టిగా హెచ్చరించింది.












Click it and Unblock the Notifications