'సౌదీలో చిక్కుకున్న నన్ను కాపాడండి'.. జగిత్యాల యువకుడి ఆవేదన..!
చాలామంది చదువు, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నిత్యం వందలమంది యువత బయటి దేశాలకు వెళ్తుంటారు. ఉన్నత చదువులు, ఐటీ ఉద్యోగాల కోసం అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వెళ్తుండగా ఉపాధి పనుల కోసం సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్ లాంటి దేశాలకు వెళ్తుంటారు. వీరిలో పేద, మధ్య తరగతి ప్రజలే ఎక్కువ మంది ఉంటారు. విదేశాల్లో ఎంతో కొంత సంపాదించి స్వగ్రామానికి తిరిగి రావాలని భావిస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో సౌదీ అరేబియాలో జరిగే మోసాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుట్టల్లపల్లి గ్రామానికి చెందిన అరవింద్ పరిస్థితి తెలిస్తే.. గోట్ లైఫ్ అనే మలయాళం సినిమాలోని పృథ్వీరాజ్ సుకుమారన్ జర్నీ గుర్తుకొస్తుంది. ఉద్యోగం కోసం సౌదీ వెళ్లిన హీరోను అక్కడి ఏజెంట్ మోసం చేయడంతో అక్కడే ఎడారిలో నరకయాతన అనుభవిస్తాడు. చావు బతుకుల మధ్య చివరకు భారత్ చేరుకుంటాడు. ఇప్పుడు ఇదే స్టోరీ అరవింద్ కూ వర్తిస్తుంది. ఉపాధి కోసం అరవింద్.. ఫిబ్రవరి 15 న సౌదీ అరేబియాకు వెళ్లాడు. దానికోసం ఏజెంట్ కు రూ. 90 వేలు చెల్లించాడు. తీరా అక్కడికి వెళ్లాక అరవింద్ మోసపోయినట్లు గ్రహించాడు. తొలుత అరవింద్ కు ప్యాకింగ్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం ఇస్తామని నమ్మించి తీసుకెళ్లగా.. అక్కడ గొర్రెల కాపరిని చేశారు. అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు వీడియో ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశాడు.

తనను ఓ ఏజెంట్ మోసం చేశాడని ఎడారి ప్రాంతంలో తిండి, తాగునీరు, విద్యుత్ లేని ప్రాంతంలో వదిలేశాడని గొర్రెలకు పెట్టే నీళ్లనే తాగాల్సి వస్తోందని ఈ మేరకు ప్రాణ భయంతో రోజులు గడుపుతున్నానని ఎమోషనల్ అయ్యాడు. సౌదీ అరేబియా రాజధాని రియాద్ కు దాదాపు 950 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఎడారి ప్రాంతంలో గొర్రెల కాపరిగా పనిచేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి తనను కాపాడాలని విలపిస్తున్నాడు. అటు అధికారులు స్పందించి అరవింద్ ను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications