మరణాలలో ప్రపంచంలో మూడోస్థానంలో భారత్; తాజాగా 1.49లక్షల కొత్త కేసులు, 1,072 మరణాలు
భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. భారతదేశంలో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గినట్టు కనిపిస్తున్నాయి. భారతదేశంలో ఈరోజు 1.49 లక్షల కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు ముందురోజు నమోదైన కేసులతో పోలిస్తే 13% తక్కువ. భారత్ లో కరోనా కేసుల సానుకూలత రేటు 9.2శాతానికి పడిపోయింది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో క్రియాశీల కేసులు 3.42 శాతం ఉండగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 95.39 శాతానికి చేరుకుంది.

5 లక్షలకు పైగా మరణాలను నమోదు చేసిన ప్రపంచంలోనే మూడో దేశం భారత్
ఇదిలా ఉంటే కోవిడ్ -19 మహమ్మారి కారణంగా 5 లక్షలకు పైగా మరణాలను అధికారికంగా నమోదు చేసిన ప్రపంచంలో మూడవ దేశంగా భారతదేశం నిలిచింది. గురువారం ఈ భయంకరమైన మైలురాయిని భారతదేశం చేరుకుంది. భారత్లో తాజా కరోనా కేసుల పరిస్థితిని బట్టి చూస్తే 3వ వేవ్ గరిష్ట స్థితిని దాటిందేమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓ దశలో నాలుగు లక్షలకు చేరువగా చేరిన కరోనా కేసుల స్థితి నుండి ప్రస్తుతం లక్ష 50 వేల కరోనా కేసులకు పరిస్థితి మారిందని, దీంతో మూడో వేవే పీక్స్ నుండి బయట పడ్డామా అన్న చర్చ ప్రజల్లో జరుగుతుంది. అందుకు ఊతమిస్తూ దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు, పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతోందని కేంద్రం పేర్కొంది.

యాక్టివ్ కేసుల సంఖ్య 14,35,569
డిసెంబర్ నుండి, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా కోవిడ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 14,35,569గా ఉంది. గత 24 గంటల్లో 1,072 కోవిడ్ సంబంధిత మరణాలు సంభవించాయి. దీంతో మొత్తంగా మరణాల సంఖ్య 5,00,055 కు చేరుకుంది. గత 24 గంటల్లో 2,46,674 రికవరీలు నమోదయ్యాయి. రోజువారీ కేసుల కంటే రికవరీ ఎక్కువగా నమోదు కావడం కాస్త ఊరట నిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం రికవరీల సంఖ్య 4,00,17,088కి చేరుకుంది.

11శాతం నుండి 9.27శాతానికి రోజువారీ సానుకూలత రేటు
భారతదేశం యొక్క రోజువారీ సానుకూలత రేటు నేడు 11% నుండి 9.27%కి పడిపోయింది. ఇది కాస్త రిలీఫ్ ఇస్తుంది. వీక్లీ పాజిటివిటీ రేటు 12.03%కి తగ్గింది. గత 24 గంటల్లో భారత్ 16,11,666 కోవిడ్ పరీక్షలను నిర్వహించింది.కేరళ మరియు మిజోరాంలలో కేసుల పెరుగుదల ఆందోళనకరంగా ఉందని కేంద్రం వెల్లడించింది. కేరళ రాష్ట్రంలో 47% మరియు మిజోరాం రాష్ట్రంలో 34% కంటే ఎక్కువ వీక్లీ పాజిటివిటీ రేట్లను నివేదించడం వలన కేంద్రం ఆందోళన చెందుతుంది. ఇది భారతదేశం యొక్క మొత్తం 13% కంటే చాలా ఎక్కువ అని కేంద్రం పేర్కొంది.

కేరళ రాష్ట్రంలో గత 24 గంటల్లో 42,677 కరోనా కేసులు
దేశంలో కేరళ, మరియు మిజోరాంలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కేరళ రాష్ట్రంలో గత 24 గంటల్లో 42,677 కరోనా కేసులు నమోదయ్యాయి. పరీక్షలో సానుకూలత 37.23 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో మిజోరంలో గురువారం 2,145 తాజా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. మునుపటి రోజు కంటే 428 తక్కువ. దీంతో మొత్తం ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 1,79,740కి చేరుకుందని అధికారికంగా తెలిపారు. ఏది ఏమైనా కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.












Click it and Unblock the Notifications