భారత్-కొరియా బంధంపై యోగీ ప్రశంసలు-వారి ఆధ్యాత్మిక మూలాలూ ఇక్కడే ఉన్నట్లు వెల్లడి..
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ భారత్-కొరియా బంధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాయని, కానీ ఇరుదేశాల మధ్య ఆధ్యాత్మిక బంధానికి మాత్రం దశాబ్దాల చరిత్ర ఉందని తెలిపారు. కొరియా ఆధ్యాత్మిక మూలాలు భారత్ లోనే ఉన్నాయని యోగీ తెలిపారు.
దక్షిణకొరియాకు చెందిన బౌద్ధ సంఘం జోగ్యే బుద్ధిస్ట్ సంఘ్ యూపీలో ఆధ్యాత్మిక స్ధలాల్ని కలుపుతూ నిర్వహించిన 43 రోజుల పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం యోగీ ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొరియాతో భారత్ బంధాన్ని గుర్తుచేసుకున్నారు. కొరియాలోని ధ్యాన కల్ట్ సియోన్ ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తి జిల్లాలోని జెత్వాన్ ప్రాంతంలో ఉద్భవించిందని యోగీ వెల్లడించారు. అయోధ్య యువరాణి సుమారు 2,000 సంవత్సరాల క్రితం అయోధ్య నుండి కొరియాకు జలమార్గంలో ప్రయాణించారన్నారు. అక్కడ ఆమె స్థానిక రాజు కిమ్ సురోను వివాహం చేసుకుందన్నారు. యువరాణికి హియో-హ్వాంగ్-ఓక్ అని పేరు కూడా పెట్టారన్నారు. కరక్ రాజవంశం యువరాణి హియో-హ్వాంగ్-ఓక్, అలాగే రాజు కిమ్ సురోచే స్థాపించబడిందన్నారు. ప్రస్తుతం కొరియాలో గణనీయంగా జనాభా ఈ వంశంతో ముడిపడి ఉందన్నారు.

2018లో దక్షిణ కొరియా ప్రథమ మహిళ కిమ్ జంగ్-సూక్ నవంబర్ 6న అయోధ్యలో జరిగిన దీపోత్సవ్ శుభ కార్యక్రమంలో పాల్గొన్నారని యోగీ గుర్తుచేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి అయోధ్యలో క్వీన్ హో మెమోరియల్ పార్క్ ప్రాజెక్టుకు ఆమె శంకుస్థాపన చేశారన్నారు. రామ్‌కథా పార్కు సమీపంలో 11,658 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మెమోరియల్ పార్క్ అభివృద్ధి చేసినట్లు తెలిపారు. పార్క్‌లో రాజు మంటపం, రాణి మంటపం, కొరియన్ గోడ నిర్మాణానికి రూ.21.92 కోట్లు ఖర్చు చేశారని యోగీ వెల్లడించారు. అయోధ్య , కొరియాలోని గిమ్హే నగరం సోదర నగరాలు అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
బుద్ధుని ధర్మాన్ని కొరియాలో చైనా ద్వారా భారతదేశానికి చెందిన బౌద్ధ గురువు బోధిధమ్మ ప్రవేశపెట్టారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications