పాక్ ప్రధానిని ఆహ్వానించబోతున్న కేంద్రం ? గోవాలో అత్యున్నత స్ధాయి భేటీ !
తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో అల్లాడుతున్న పొరుగుదేశం పాకిస్తాన్ ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. తాజాగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్ ను ఆదుకోవాలని కోరారు. భారత్ తో చర్చలకు సిద్దంగా ఉన్నట్లు కూడా చెప్పుకొచ్చారు. దీంతో భారత్ కూడా ఆయన విజ్ఞప్తిని మన్నించేలా కనిపిస్తోంది.
ఈ ఏడాది మేనెలలో గోవాలో జరిగే అత్యున్నత స్ధాయి షాంఘై సహకార సమాఖ్య (SCO) సదస్సుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను అధికారికంగా ఆహ్వానించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారత్, చైనాతో పాటు ఉపఖండపు దేశాలు పాల్గొనే ఈ సదస్సులో పాకిస్తాన్ ప్రధానిని కూడా ఆహ్వానించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
బుధవారం పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో, చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్‌లకు గోవాలో జరిగే ఎస్‌సిఓ సదస్సుకు సంబంధించిన ఆహ్వానాలను అందజేశారు. అయితే మిగతా దేశాలతో పాటు మాత్రమే పాకిస్తాన్ ను ఆహ్వానించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

అయితే ఈ సదస్సుకు పాక్ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టో, చైనా విదేశాంగమంత్రి క్విన్ గ్యాంగ్ హాజరవుతారో లేదో ఇంకా తేలలేదు. ఒకవేళ పాకిస్థాన్ ప్రధాని లేదా విదేశాంగ మంత్రి ఈ సమావేశానికి వ్యక్తిగతంగా హాజరు కావాలని నిర్ణయించుకుంటే, 2011 తర్వాత ఇస్లామాబాద్ నుంచి భారత్‌కు వెళ్లడం ఇదే తొలిసారి అవుతుంది. అప్పటి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ ఆ ఏడాది భారత్‌లో పర్యటించారు.
పుల్వామా ఉగ్రదాడి తర్వాత 2019 ఫిబ్రవరిలో పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోని జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరాన్ని భారత యుద్ధ విమానాలు ధ్వంసం చేయడంతో భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి ఇరుదేశాలూ ఒకే వేదికపై ఎలాంటి భేటీలు కావడం కానీ, హాజరు కావడం కానీ చేయలేదు. తాజాగా మారిన పరిస్ధితుల్లో పాకిస్తాన్ భారత్ వైపు చూస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications