వచ్చే 40 రోజులు అత్యంత గడ్డుకాలం- విస్పష్ట ప్రకటన చేసిన కేంద్రం..!!
న్యూఢిల్లీ: చైనాను వణికిస్తోన్న అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ బీఎఫ్ 7 వేరియంట్ పాజిటివ్ కేసులు దేశంలో నమోదవుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో 39 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 3468కి చేరింది. మొత్తం రికవరీలు 4,41,43,483గా రికార్డయ్యాయి. ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య అయిదున్నర లక్షలకు చేరువైంది. ఇవ్వాళ్టికి 5,30,696గా నమోదైంది.

భయపెడుతున్న వేరియంట్..
శరవేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఉన్న బీఎఫ్ 7 వేరియంట్ కావడం వల్ల తక్షణమే ముందు జాగ్రత్త చర్యలకు దిగింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలను సైతం అప్రమత్తం చేసింది. కోవిడ్ మార్గదర్శకాలు, నియమ నిబంధనలను జారీ చేసింది. కొత్త సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి పండగ సీజన్ ఆరంభం కాబోతోన్నందున అప్రమత్తంగా ఉండాలనీ సూచించింది.

ఆర్టీపీసీఆర్ పరీక్షలు..
ఇన్‌ఫ్లుయెన్జా లైక్ ఇల్ నెస్ (ఐఎల్ఐ), సీవర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్ నెస్ (ఎస్ఏఆర్ఐ) వంటి జిల్లా స్థాయిలో నిఘా ఉంచాలంటూ కేంద్రం సూచించింది. అదే సమయంలో చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు వచ్చే విదేశీయులపై ప్రత్యేకంగా నిఘా పెట్టనుంది. ఈ అయిదు దేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టులను తప్పనిసరి చేయడానికి కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్యలను తీసుకుంటోంది.

ఎలా ఎదుర్కోవాలి..
కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదైతే- దాన్ని ఎలా ఎదుర్కొనాల్సి ఉంటుందనే విషయంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్‌ను నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ జరిగాయి. ఆసుపత్రులు, కోవిడ్ వార్డులు, క్వారంటైన్ కేంద్రాలు, ఐసొలేషన్ సెంటర్లు, ఆక్సిజన్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్స్ కిట్స్, మాస్కుల నిల్వలు, వాటి సరఫరా, డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ కేర్ సిబ్బంది, ఆర్టీపీసీఆర్, యాంటీజెన్, ఆక్సిజన్ సిలిండర్ల నిల్వలపై మాక్ డ్రిల్ పూర్తయింది.

వచ్చే 40 రోజులు..
ఈ పరిణామాల మధ్య కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరోసారి ముందస్తు హెచ్చరికల సంకేతాలను పంపించింది. వచ్చే 40 రోజులు అత్యంత గడ్డుకాలంగా పరిణమిస్తుందని అంచనా వేసింది. జనవరి రెండోవారం నుంచి దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం లేకపోలేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో గతానుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం.

ఈస్ట్ ఆసియాలో..
తూర్పు ఆసియా దేశాల్లో ప్రవేశించిన 30 నుంచి 35 రోజుల వ్యవధిలో కోవిడ్ వేవ్ దేశాన్ని తాకిందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. అవే లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఇప్పుడు కూడా వచ్చే 40 రోజుల్లో ఈ కోవిడ్ వేవ్ భారత్‌ను తాకే ప్రమాదం లేకపోలేదని స్పష్టం చేస్తోన్నాయి. ప్రస్తుతానికి కొత్త కోవిడ్ వేరియంట్ తీవ్రత ఊహించినంత భయోత్పాతాన్ని కలిగించట్లేదని, మరణాలు గానీ, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య గానీ చాలా తక్కువగానే ఉంటోందని వివరించాయి.












Click it and Unblock the Notifications