బీ అలర్ట్: దేశంలో 60 వేలకు చేరువైన కరోనా యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి క్రమంగా పెరుగుదల బాట పట్టింది. కొద్దిరోజులుగా వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇవ్వాళ కూడా అదే పరిస్థితి నెలకొంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. కొత్తగా 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం కూడా హెచ్చరిస్తోంది.
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 1,79,853 మేర కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు అధికారులు. ఈ పరీక్షల్లో కొత్తగా 10,093 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో యాక్టివ్ కేసుల సంఖ్య 57,542కు పెరిగింది. కోవిడ్ తొలి దశ నుంచి ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 5,31,114కు చేరింది. ప్రపంచంలోనే రెండో అత్యధిక కోవిడ్ మరణాల సంఖ్య ఇదే.

కోవిడ్ మరణాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంటోంది. 11,58,158 మంది అక్కడ మృత్యువాత పడ్డారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఢిల్లీ, మహారాష్ట్ర వాటా అధికంగా ఉంటోంది. ఢిల్లీలో 1,396 పాజిటివ్ కేసులు గత 24 గంటల వ్యవధిలో నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఈ సంఖ్య 660గా రికార్డయింది. మరోవంక- వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇప్పటిదాకా 220,66,26,324 డోసుల వ్యాక్సిన్‌ను కేంద్రం పంపిణీ చేసింది.

కరోనా వైరస్ తీవ్రత తగ్గినప్పటికీ.. కొద్దిరోజులుగా వాటి సంఖ్య భారీగా పెరుగుతోండటం ఆందోళనకు దారి తీస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కోవిడ్ ప్రొటోకాల్స్‌ను ప్రవేశపెట్టాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోని ఆసుపత్రుల్లో కోవిడ్ మాక్ డ్రిల్స్ కూడా పూర్తయ్యాయి. మాస్కులను మాత్రం ధరించక తప్పదని కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేస్తోంది. కరోనా ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, కనీసం ఇంకో ఏడాది పాటు ప్రొటోకాల్స్‌ను పాటించాల్సి ఉంటుందని సూచిస్తోంది.












Click it and Unblock the Notifications