ప్రపంచ పటాన్ని సరిచేయబోతున్న ఐరాస..! కాశ్మీర్, లడఖ్ షరతుతో భారత్ ఓకే..!
ప్రపంచ పటం (world map)పై వివిధ దేశాల సరిహద్దుల విషయంలో వివాదాలు, ఘర్షణల నేపథ్యంలో దీన్ని సరి చేసేందుకు ఐక్యరాజ్యసమితి (UN) సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ఐరాసలో ఓ తీర్మానం కూడా ప్రవేశపెట్టింది. భారత్ (India) ఈ చర్యకు అనుకూలంగా ఓటు వేసింది. అయితే తమ మద్దతు కేవలం ఇప్పటికే అమల్లో ఉన్న వాటికి మాత్రమేనని, అన్యాయంగా మార్చేందుకు మాత్రం కాదని తేల్చిచెపింది. ఇది ఏ ప్రత్యేక పటాన్ని ఆమోదించడం గానీ లేదా భారత భూభాగాన్ని చిత్రీకరించే విధానాన్ని మార్చడం గానీ కాదని స్పష్టం చేసింది.
జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లను భారత అధికారిక మ్యాప్ ప్రకారమే చూపించాలని, ఎలాంటి తప్పుడు లేదా తప్పుదారి పట్టించే చిత్రీకరణ అయినా ఆమోదయోగ్యం కాదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది. ఐరాస ప్రవేశపెట్టిన ఈ తీర్మానం సాంకేతికంగా తటస్థంగా ఉండాలని కూడా తెలిపింది. ఖండాంతర భూభాగాల సాపేక్ష పరిమాణాలను కాపాడే సమాన-ప్రాంత పట ప్రక్షేపణలను ఉపయోగించాలనే విస్తృత సూత్రానికి మద్దతు ఇస్తామనని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

వరల్డ్ మ్యాప్ లో ప్రాతినిధ్యాన్ని పునఃసమతుల్యం చేయడం, ప్రపంచ ప్రాంతాలకు, ముఖ్యంగా ఆఫ్రికాకు సమాన ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహించడం అనే శీర్షికతో కూడిన తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సెప్టెంబర్ 4న ఆమోదించిందని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ తీర్మానాన్ని శుక్రవారం ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 164-1 ఓట్ల తేడాతో ఆమోదించింది. దీని ప్రకారం ఐరాస మెర్కేటర్ ప్రక్షేపణ వంటి సాంప్రదాయ వ్యవస్థలతో ముడిపడి ఉన్న వక్రీకరణలను పరిష్కరించడానికి, సమాన-ప్రాంత పట ప్రక్షేపణలపై విస్తృత పరిశీలన చేపడుతుంది. భారత్ ఈ తీర్మానానికి మద్దతు ఇస్తూనే, దీనిని జాతీయ సరిహద్దుల యొక్క నిర్దిష్ట చిత్రీకరణకు ఆమోదంగా భావించరాదని క్లారిటీ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలతో సహా భారత సార్వభౌమ భూభాగాన్ని దేశ అధికారిక మ్యాప్ ప్రకారమే చూపించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.














Click it and Unblock the Notifications